Health Cards To Orphans: దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఫస్ట్ టైమ్ అనాథ పిల్లలకు ఆరోగ్య శ్రీ కార్డులు అందజేశామని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అనాధ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులను అందజేయనున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. టూరిజం ప్లాజా హోటల్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అనాధ, నిరాశ్రయులైన పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తో కలసి మంత్రి సీతక్క పాల్గొన్నారు.
కార్డులు పంపిణీ చేసినానంతరం ఆమె మాట్లాడుతూ, అనాథ పిల్లలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో విప్లవాత్మక మైన నిర్ణయాలు అనాధ పిల్లలకు ప్రభుత్వమే కుటుంబమని మంత్రి వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేరదీయడం కనీస బాధ్యత, మానవత్వం జోడించి అనాధ పిల్లలు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసేలా ఆటలు పాటలు చదువులో అగ్రభాగాన ఉండేలా కృషి చేయాలన్నారు.
Also Read: Tummala Nageswara Rao: గిరిజన జిల్లాను అభివృద్ధిలో.. నవ కాంతులతో ముందుకు తీసుకువెళ్తాం!
దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ లో 2200 అనాధ, నిరాశ్రయులైన పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేసి సర్కారు తన ఉదారతను చాటుకుంటుందన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అనాధ, నిరాశయులైన పిల్లలకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను అందిస్తామని, వారి సంక్షేమం కోసం పని చేస్తామని తెలిపారు.
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అనాధ పిల్లలకు కుల ధృవీకరణ, ఆధార్ ఇప్పటికే అందజేశామని జిల్లాలో అనాధ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించటం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. అనాధ పిల్లలకు అండగా ఉంటూ, వారిలో మనోధైర్యాన్ని కలిగించి, వారి జీవిత లక్ష్యం వైపు వెళ్లేలా మహిళా సంక్షేమ శాఖ ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా హైదరాబాద్ జిల్లాలోని అనాధ, నిరాశ్రయులైన పిల్లలకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందించడంలో ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ని మంత్రి అభినందించారు.
హైదరాబాద్ జిల్లాలోని అన్ని అంగన్ వాడీ కేంద్రాల ద్వారా కూలీల పిల్లలకు అల్పాహారం అందించే దిశగా ప్రభుత్వం పరిశీలన చేస్తుందని, త్వరలోనే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో 2,200కి పైగా అనాథ , నిరాశ్రులైనా చైల్డ్ కేర్ ఇన్ స్టిట్యూట్ లోని పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. ఈ కార్డుల ద్వారా 95కి పైగా గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో 180కి పైగా వైద్య చికిత్సలు ఉచితంగా పొందే అవకాశముందని వివరించారు.
Also Read: High Court Verdict: కల్తీ కల్లు తయారీ కేసుపై.. హైకోర్టు కీలక తీర్పు!
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలోని 50 చైల్డ్ కేర్ ఇన్ స్టిట్యూట్ లోని 4వేల మంది పిల్లలకు కుల, జనన, ఆధార్ ధృవీకరణ పత్రాలను రెండు దశల్లో అందించినట్లు తెలిపారు. అనాధ పిల్లల ఆరోగ్య సమస్యల కోసం మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం తరఫున అనాధ పిల్లలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వర్తించేలా చేశామన్నారు. పిల్లలందరికీ రేషన్ కార్డులు అందించనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
ఆర్ఫన్ కార్డు ఆధార్ నెంబర్ ఐడీ గా చికిత్స అందించనున్నట్లు కలెక్టర్ వివరించారు. అనాధ, నిరశ్రాయుల పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మంత్రులు పిల్లలతో ముచ్చటగా ఫోటోలు దిగి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. డిప్యూటీ మేయర్ మోతే శోభన్ శ్రీలత రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ నిర్మల కాంతి వెస్లీ, అదనపు కలెక్టర్ ముకుంద రెడ్డి, జల్లా సంక్షేమాధికారి అక్కేశ్వరరావు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త సాయి నారాయణ గౌడ్, జిల్లా మేనేజర్ మహబూబ్ పాషా, సీడీపీఓలు, ఐసీడీఎస్, ఐసీపీఎస్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read: TDP MLA: రాత్రిపూట మహిళా ఎమ్మార్వోకు టీడీపీ ఎమ్మెల్యే ఫోన్.. పచ్చి బూతులు.. సీఎం ఏం చేస్తున్నట్లు?