Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అదిరిపోయే శుభవార్తలు చెప్పారు. అందులోనూ ఒకటి రెండు కాదు ఏకంగా మూడు శుభవార్తలు చెప్పడం విశేషమనే చెప్పుకోవచ్చు. ఇందులో ఒకటి.. రాష్ట్రంలోని మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉచిత బస్సు’ కు సంబంధించిన తీపి కబురు కూడా ఉన్నది. దీంతో ఆడపడుచుల ఆనందానికి అవధుల్లేవ్. ‘థ్యాంక్యూ సీఎం సార్.. థ్యాంక్యూ సీబీఎన్’ అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. మిగిలిన రెండు శుభవార్తలు ఏంటి? ఎప్పుడు, ఎక్కడ చంద్రబాబు ప్రకటించారు? ఎప్పట్నుంచి అమలు చేస్తామని చెప్పారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
ఆ మూడు ఇవే..
చంద్రబాబు చెప్పిన మూడు శుభవార్తల్లో ఒకటి ‘ఏపీలో మహిళలకు ఉచిత బస్సు’ (Free Bus Scheme For Women).. రెండు ‘తల్లికి వందనం’ (Talliki Vandhanam).. మూడోది ‘అన్నదాత సుఖీభవ’ (Annadata Sukhibhava) పథకం. ఈ మూడింటిపైన కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబు కీలక అప్డేట్ ఇచ్చారు. అంతేకాదు.. రాయలసీమపై వరాల జల్లు కూడా కురిపించారు. పూర్తి వివరాల్లోకెళితే.. ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అదే విధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఇక ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు ఏటా రూ. 14 వేలు ఇస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు కలిపి ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. అంతేకాదు.. ఓర్వకల్‌కు రైల్వే ట్రాక్ కూడా తీసుకొస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర..
శనివారం నాడు కర్నూలు జిల్లా, పాణ్యంలో చంద్రబాబు పర్యటించారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర’ ( Swarnandhra Swachhandhra) లో భాగంగా ఉద్యానవనం అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీ క్యాంప్ రైతుబజార్‌కు సీఎం వెళ్ళారు. అక్కడ రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్ధాలతో ఎరువుల తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ముఖ్యమంత్రి ప్రమాణం చేయించారు. ప్రతి నెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని, ఉద్యోగులు కూడా ప్రతినెలా మూడో శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రైతుబజార్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రపంచం మెచ్చుకునేలా యోగా డే నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ‘బుద్ధుడు – శిష్యుడు’ కథను ప్రజలకు చెప్పారు. శనివారం సాయంత్రానికి చంద్రబాబు కర్నూలు పర్యటన ముగిసింది. ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు రానున్నారు. అక్కడ్నుంచి ఓర్వకల్ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం కానున్నారు. మళ్లీ సోమవారం హైదరాబాద్ నుంచి అమరావతికి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. కాగా వారాంతంలో అమరావతి నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు వస్తున్న సంగతి తెలిసిందే.