TSFCC: ప్రస్తుతం థియేటర్లలో సినిమా మనుగడ చాలా కష్టంగా మారింది. ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. బీభత్సమైన పాజిటివ్ టాక్ వస్తే తప్పితే.. స్టార్ హీరో సినిమా అయినా కూడా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ఇక ఫ్యాన్స్‌కి తప్పక స్టార్ హీరోల సినిమాలకు ఓ రెండు మూడు రోజులు థియేటర్ల కళకళలాడుతున్నాయి. టాక్ బాగుంటే, ఇంకో వారం, పది రోజుల వరకు ఆ సందడి ఉంటుంది. లేదంటే, మరో ఆలోచన లేకుండా ఓటీటీలో చూసుకోవచ్చని వదిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఉంటే, ఇంకా నడ్డి విరిచేలా పైరసీ, రిలీజ్ రోజే ఒరిజినల్ ప్రింట్ లీక్స్ వంటివి నిర్మాతలు తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ఈ గొడవ ఇలా ఉంటే.. ఎగ్జిబిటర్స్, బయ్యర్స్ వంటి వారి గొడవలు మరోలా ఉన్నాయి.
Also Read- Pawan Kalyan: ‘ఓజీ’ షూట్ నుంచి సరాసరి ‘తిరంగా యాత్ర’కు.. ఆ టాట్టూ గమనించారా?
దీంతో తెలంగాణ థియేటర్ల వ్యవస్థపై తప్పుడు సంకేతాలను పంపేలా కొన్ని వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఆ వార్తలను నమ్మవద్దు అంటూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ (TSFCC) ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇందులో.. ‘‘తెలంగాణ (Telangana) లోని ఎగ్జిబిటర్లు.. సినిమా థియేటర్లను కేవలం షేర్ ఆధారిత వ్యవస్థపైనే నడపాలని నిర్ణయించారని, అలాగే పర్సంటేజ్ పద్ధతుల్లో థియేటర్ల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారని కొన్ని న్యూస్ చానల్స్, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఈ సమస్యపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ప్రకటనలో స్పష్టం చేసింది.
Also Read- Kannappa: ‘కన్నప్ప’ కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్.. ‘శివయ్యా’ అని విష్ణు ఎందుకు పిలిచాడంటే?
అలాగే, ఆంధ్రా మరియు తెలంగాణ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం మే 18వ తేదీన జరగనుందని, ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లకు సంబంధించిన పలు సమస్యలపై చర్చిస్తామని.. అలాగే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై చర్చ జరగనున్నదని పేర్కొన్నారు. సమావేశం పూర్తైన తర్వాత అధికారిక సమాచారం మీడియాకు అందిస్తామని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ప్రకటనలో తెలిపింది. అప్పటి వరకు ఎలాంటి నిరాధారమైన వార్తలను ప్రచురించవద్దని కోరింది. అది విషయం. ఒకవైపు థియేటర్లలో సినిమా ఎలారా దేవుడా? అని నిర్మాతలు నెత్తినోరు బాదుకుంటుంటే.. ఎగ్జిబిటర్లు, బయ్యర్లు వారి పర్సంటేజ్‌లో గొడవలో మునిగిపోయారు. చూస్తుంటే, ఈ రూపంలో కూడా థియేటర్లలో సినిమాకు దెబ్బపడే అవకాశం ఉందనేలా టాలీవుడ్ చెందిన సినీ పెద్దలు కొందరు మాట్లాడుకుంటున్నారు.
మే 18వ తేదీన అసలు ఏం జరగబోతుంది? ఎందుకిలా లేనిపోని వార్తలను పుట్టిస్తున్నారు. ఫైనల్‌గా ఆ తేదీన ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? అనే విషయాలకు సమాధానం తెలియాలంటే మాత్రం ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు