AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలక నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అరెస్ట్ చేసింది. ధనుంజయరెడ్డి ఐఏఎస్‌గా పనిచేశారు. వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగారు కూడా. మాజీ సీఎం జగన్‌కు కృష్ణమోహన్‌రెడ్డి ఓఎస్డీగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పట్నుంచీ ఇప్పటి వరకూ ఆయనే ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ అరెస్ట్‌ను సిట్ అధికారులు కూడా ధృవీకరించారు. వరుసగా మూడు రోజుల పాటు ఈ ఇద్దరినీ సిట్ విచారించిన సంగతి తెలిసిందే. త్వరలోనే కీలక పరిణామం చోటుచేసకుంటుందని ప్రచారం జరుగుతూనే ఉంది. అనుకున్నట్లుగా సుదీర్ఘ విచారణ అనంతరం ఈ ఇద్దరినీ సిట్ అరెస్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. మందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో అరెస్ట్‌కు మార్గం సుగుమమైంది. కాగా ఈ కేసులో వీరిద్దరూ ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. ఏ 33 నిందితుడుగా ఉన్న గోవిందప్ప బాలాజీని మూడు రోజుల కిందటే సిట్ అరెస్ట్ చేసింది.
కుట్రతోనే లిక్కర్ స్కామ్..!
వైసీపీ హయాంలో పూర్తి పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో నిజంగా తప్పు జరిగి ఉంటే, నిష్పాక్షికంగా జరిపే ఎలాంటి విచారణనైనా స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు విచారణల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని, ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండ గడతామని కాకినాడలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. ‘ కూటమి ఏడాది పాలనలో పార్టీల హనీమూన్ ముగిసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. కూటమి పాలనలో అవినీతి, దోపిడీ తప్ప ప్రజా సంక్షేమం, అభివృద్ది ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయ కక్ష సాధింపులకే మొత్తం సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఎన్నికల మందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు పెట్టుబడి సాయం, ప్రతి కుటుంబానికి ఏటా మూడు ఉచిత సిలిండర్లు, ఏటా 4 లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెలా ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేల భృతి, ఆడబిడ్డ నిధి కింది ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. కానీ, ఏడాది గడుస్తున్నా వాటిలో ఏదీ అమలు చేయడం లేదు’ అని బొత్స మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ కూడా..
‘ ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అంతులేని అవినీతి జరుగుతోంది. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కేవలం 99 పైసలకే దాదాపు 3 వేల కోట్ల విలువైన భూముల అప్పగించడం ఏంటి?. ఇంకా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ సీజ్ ది షిప్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నానా హంగామా చేశారు. ఒక్క బియ్యం గింజ కూడా అక్రమంగా రవాణా చేయడానికి వీలులేదని అన్నారు. కానీ ఒక్క దానిపైనా చర్యలు లేవు. పోలీసుల జులుంతో ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. అందుకే ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు. ఏడాది పాలనలోనే ఏకంగా రూ.1.59 లక్షల కోట్లు అప్పులు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతలా ఏడాదిలో అప్పులు చేయలేదు. ఇంత అప్పులు తెచ్చి ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు చేశారు? మా హయాంలో అప్పులు చేసినా, వివిధ పథకాల కింద రూ.2.73 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. మరి కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు దేనికి వినియోగించారో చెప్పాలి. సంపద సృష్టిస్తాను. అది తనకు బాగా తెలుసు అని ప్రచారం చేసిన చంద్రబాబు, మరి ఇన్ని అప్పులు, ఇంత తక్కువ సమయంలో ఎందుకు చేశారు? అప్పు చేయడం. ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేయడం చంద్రబాబుకు బాగా అలవాటు. అదే వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంత అప్పు చేసినా, ఆ ఖర్చులకు ఒక అర్థం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, తీర ప్రాంతాల్లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, బోగాపురం ఎయిర్‌పోర్ట్.. ఇలా ఉత్పాదకతకు దోహదం చేసే వాటికి ఖర్చు చేశాం. మాట ఇస్తే, దాన్ని తప్పకుండా నెరవేర్చాలనేది జగన్‌గారి విధానం. అందుకే ఎన్నికల ముందు, టీడీపీ కూటమి మాదిరిగా, అడ్డగోలు హామీలు ఇవ్వలేదు’ అరి బొత్స విమర్శలు గుప్పించారు.
Read Also- Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. ఇప్పుడైనా బయటికొస్తారా?