Murali Naik: ముర‌ళి కుటుంబానికి వైసీపీ ఆర్థిక‌సాయం
YSRCP Cheque For Murali Family
ఆంధ్రప్రదేశ్

Murali Naik: ముర‌ళి కుటుంబానికి వైసీపీ ఆర్థిక‌సాయం.. ఎంతంటే..?

Murali Naik: ‘ఆపరేషన్‌ సింధూర్‌’లో భాగంగా ఈ నెల 8న జమ్మూకశ్మీర్ లో శత్రుమూకలను చెండాడుతూ అగ్నీవీర్‌ మురళీ నాయక్‌ వీరమరణం పొందారు. ఈ నెల 13న మురళీ కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. మురళీ నాయక్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిలను ఓదార్చారు. మురళీ కుటుంబానికి వైసీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు జగన్‌ ప్రకటించారు. శుక్రవారం నాడు జ‌గ‌న్ ఆదేశాల‌తో పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉష‌శ్రీ‌చ‌ర‌ణ్‌.. మురళి నివాసంలో ఆయ‌న తల్లితండ్రులు జ్యోతిబాయ్, శ్రీరామ్ నాయక్‌కు రూ.25 ల‌క్షల చెక్కును అంద‌జేశారు. పార్టీ ప‌రంగా అండ‌గా ఉంటామ‌ని అధినేత హామీ ఇచ్చిన‌ట్లు మ‌రోసారి ఉష‌శ్రీ‌చ‌ర‌ణ్ గుర్తు చేశారు.

Murali Naik Parents And Jagan
మురళీ త్యాగానికి వెల కట్టలేం..

కాగా, మురళీ కుటుంబానికి వైసీపీ కొండంత అండ‌గా నిలిచింది. నాడు పరామర్శ తర్వాత మురళి పోరాటాన్ని దేశం గర్విస్తోందని జగన్‌ కొనియాడారు. ‘ మురళీనాయక్‌ చిన్నవాడైనా తన మరణంతో రాష్ట్రంలో చాలా మందికి, పెద్దలకు స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు. దేశం కోసం పోరాడుతూ తన ప్రాణ త్యాగంతో అనేక మంది అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రక్షణగా నిలిచారు. దేశం కోసం తన ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని వెనక్కు తీసుకొని రాలేం కానీ, అతడు చేసిన త్యాగానికి రాష్ట్ర ప్రజలంతా రుణపడి ఉంటారు’ అని జగన్ చెప్పారు. అంతేకాదు.. దేశ రక్షణలో అమరులైన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సాయం చేయాలని వైసీపీ ప్రభుత్వం మొదట ప్రతిపాదన తీసుకొచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మురళీ నాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించినందుకు కూటమి సర్కార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆ కుటుంబానికి పార్టీ తరపున రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన జగన్.. పార్టీ తరపు నుంచి ఆ కుటుంబానికి అండగా, తోడుగా ఉంటామని జగన్ మాటిచ్చారు. మాటిచ్చినట్లుగానే మూడ్రోజుల వ్యవధిలోనే ఆ సహాయాన్ని మురళీ కుటుంబానికి అందేలాచేసి జగన్ మాట నిలబెట్టుకున్నారని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

Minister Lokesh
అండగా ఉంటాం.. ఉద్యోగం ఇస్తాం..

కాగా, ఆదివారం అశ్రునయనాల మధ్య జవాన్ అంత్యక్రియలు ముగిశాయి. జై జవాన్, భారత మాతాకీ జై నినాదాలతో వీర జవాన్‌‌కు జనం నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, అంతిమ సంస్కరాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్ ఇంటి దగ్గర్నుంచి అంత్యక్రియలు జరిగే ప్రదేశం వరకూ.. మురళీ పాడె మోసిన లోకేష్ కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. మరోవైపు మురళీకి సీఎం చంద్రబాబు సైతం ట్విట్టర్ వేదికగా అంతిమ వీడ్కోలు పలికారు. ‘ ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుడు మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం ఇస్తాం. 5 ఎకరాల సాగుభూమితో పాటు.. 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మురళీ నేడు మన మధ్య లేకపోయినా.. ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ స్ఫూర్తి రగిలిస్తునే ఉంటుందని తెలుపుతూ నివాళి ఘటిస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా చంద్రబాబు పేర్కొన్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..