Congress Leaders: వరంగల్ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ లో రసాభాస జరిగింది. దేవరుప్పుల మండలంలో జరిగిన పార్టీ సన్నాహక సమావేశం ఉద్రిక్తతలకు దారి తీసింది. సమావేశానికి వచ్చిన స్థానిక నేత పెద్ది కృష్ణమూర్తి అనుచరులను అడ్డుకోవడంతో అతడి వర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి నియంత పోకడ నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై స్పందించిన పాలకుర్తి ఎమ్మెల్యే, ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డి సొంత పార్టీ క్యాడర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కాంగ్రెస్ లోనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే సహించేదని లేదని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డ సహనం అయిపోయిందన్న ఆమె.. పాలకుర్తి కోడలిగా సమాధానం చెప్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీకి, ఇక్కడ ఉన్న లీడర్లకు నష్టం చేస్తుంటే చూసుకుంటూ కూర్చోవాలా? అంటూ మండిపడ్డారు. జరిగేది చూస్తూ కూర్చోవడం అయిపోయిందని.. ఇకపై మాటకు మాట సమాధానం చెప్పడం ఖాయమని అన్నారు. ఇప్పటివరకూ తనను ఎన్ని మాటలు అన్నా.. ఆడబిడ్డగా ఎంతో ఒపికగా సహనంతో భరించినట్లు చెప్పారు. పార్టీలో ఉంటూ మోసాలకు పాల్పడే వారికి ఇదే చివరి అవకాశమని హెచ్చరించారు.
మరోవైపు పాలకుర్తి పార్టీ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డితో పాటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు పెద్ది కృష్ణమూర్తి తీవ్ర విమర్శలు చేశారు. ఝాన్సీ రెడ్డి అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలుసుకో అంటూ మండిపడ్డాడు. దొంగలను, ఇతర పార్టీలకు సద్దులు మోసే వ్యక్తులను అక్కున చేర్చుకున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీలో నుండి తొలగించావని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని చూసి పాలకుర్తి ప్రజలు ఓట్లు వేయలేదన్న కృష్ణమూర్తి.. పార్టీ గెలుపు కోసం తాము ఎన్నో కష్టాలు పడ్డట్లు చెప్పారు. ఎన్నో కేసులు భరించినట్లు పేర్కొన్నారు.
Also Read: Kishan Reddy – CM Revanth: మీ మంత్రే ఒప్పుకున్నారు.. కమీషన్ల మ్యాటర్ ఏంటి.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్న
తమ కష్టం, కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ప్రజలు మీకు ఓట్లు వేశారని పెద్ది కృష్ణమూర్తి అన్నారు. రావణాసురుడు లాంటి దయాకర్ రావుని తాము ఓడించామని.. మీ సూర్పనక మాటలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. సూర్పనక వేషాలు వేస్తున్న మీ అత్తా కోడళ్ళు ఇద్దరిని కూడా పాలకుర్తి నుండి తరిమికొడతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అసలు కోవర్ట్ లు ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, ఝాన్సీ రెడ్డి అంటూ కృష్ణమూర్తి ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో పాలకుర్తిలో జంగా రాఘవ రెడ్డిని ఓడిగొట్టిందే ఝాన్సీ రెడ్డి అని ఆరోపించారు. నోరు అదుపులో లేకుంటే ప్రజలు తిరగబడి మీ అత్తా కోడళ్లకు బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.