Miss World contestants: రుద్రమదేవి, సమ్మక్క సారలక్క లాంటి వీర వనితలు పుట్టిన నేలపై తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆడబిడ్డల పరువు తీసిందన్నారు. తెలంగాణ రాష్ట్రమే కాదు. భారత దేశ మహిళల పరువును ప్రపంచం ముందు తీసిన సంఘటన ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరవనితలు రాణి రుద్రమదేవి, సమ్మక్క – సారలమ్మలు పుట్టిన నేలపైనే ఈ ఘోర అవమానం జరగడం చాలా బాధాకరమన్నారు.
Also read: Medak Crime: ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య..
తెలంగాణ ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించడం, తుడిపించడం దుర్మార్గమైన, అవమానకరమైన, అత్యంత హీనమైన చర్యగా ఆమె అభివర్ణించారు. యావత్ మహిళ లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని, తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేసి మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచుతామని గొప్పగా చెప్పే ప్రభుత్వం విదేశీయుల కాళ్ళు కడిగించటం ద్వారా ఏ సంకేతాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు.
ఒకవైపు రాష్ట్రంలోని మహిళలు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడుస్తుంటే, మరోవైపు విదేశీ అందగత్తెలకు తమ కాళ్లు కడిగి, టవల్ తో తుడిపించడం దేనికి సంకేతం ఇస్తుందన్నారు.
Also read: Kondapalli Srinivas: లోకేష్‌కు సామాన్యుడి ఫిర్యాదు.. చింతిస్తూ క్షమాపణ చెప్పిన మంత్రి కొండపల్లి
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిషన్ భగీరథతో మహిళల నీటి కష్టాలు తీరిస్తే.. నేడు బిందెడు కష్టాలు తెచ్చి పాత రోజులు తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. ఆడబిడ్డల గౌరవాన్ని తగ్గించిన ఏ ఒక్కరు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదని, మహిళల ఉసురు తగిలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పతనం అవ్వటం ఖాయమన్నారు.