MLC Addanki Dayakar: కాంగ్రెస్ – బీఆర్ఎస్ త్వరలో కలిసిపోతాయంటూ బీజేపీ పార్టీ చేసిన ఆరోపణలను హస్తం నేత ఎమ్మెల్సీ, అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో ఖండించారు. అబద్దాలను ప్రచారం చేయడంలో బీజేపీ వాళ్లు దిట్ట అని వ్యాఖ్యానించారు. బీజేపీ వాళ్లకు మోకాళ్లలో మెదడు ఉందన్న ఆయన.. వారికి ఎంతకీ బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.
ఎందుకు విలీనం అవుతుంది?
బీజేపీ నేతలను నియంతలతో పోల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar).. వారికి అబద్దాల మీద ప్రేమ ఎక్కువని వ్యాఖ్యానించారు. చాలా జోక్ గా బీజేపీ వాళ్లు మాట్లాడుతున్నారని.. బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎందుకు విలీనం అవుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో విలీనం అంటూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత N.V.S.S. ప్రభాకర్ ఎవరి వర్గమో చెప్పాలని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డిలలో ఎవరి వర్గం నువ్వు అంటూ నిలదీశారు.
మీకు ఎవరు చెప్పారు?
జూన్ 2 లేదా డిసెంబర్ లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఎవరు మీకు చెప్పారని బీజేపీ నేత N.V.S.S. ప్రభాకర్ ను అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ లో విలీనం కాకుంటే రాష్ట్రంలో బీజేపీని నిషేధిస్తారా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ తో ఎలా పోరాడాలో బీజేపీకి చేతకావడం లేదా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు
డీఎన్ఏ (DNA) ఒక్కటే అని అద్దంకి దయాకర్ అన్నారు. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు తొక్కిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డే మళ్లీ సీఎం
NVSS ప్రభాకర్ గతంలో ఇలాగే కారు కూతలు కూశారని అద్దంకి దయాకర్ అన్నారు. అప్పుడు ఏం జరిగిందో ఆయనకు బాగా తెలుసని చెప్పారు. నీ చేత ఈ మాటలు ఎవరు మాట్లాడించారో చెప్పాలని పట్టుబట్టారు. ఈసారే కాదు వచ్చే టర్మ్ కూడా రేవంత్ రెడ్డినే మళ్లీ సీఎం అవుతారని ఎమ్మెల్సీ దయాకర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో బీజేపీ వారికి కూడా క్లారిటీ ఉందని అన్నారు. అందుకే వారు ఇలా ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఎప్పటికీ బీఆర్ఎస్ – కాంగ్రెస్ కలవవని రాహుల్ గాంధీ చెప్పినట్లు అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు.
Also Read: New RTI Commissioners: సమాచార హక్కు కమిషనర్ల ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
చీకటి ఒప్పందం
బీజేపీతో బీఆర్ఎస్ కు చీకటి రాజకీయ ఒప్పందం ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ గెలవని చోట బీజేపీ ఎంపీలు ఎలా గెలిచారని ప్రశ్నించారు. ఆంధ్రాలో బీజేపీకి బి – టీమ్స్ గా వైసీపీ, టీడీపీ, జనసేన ఉన్నాయని తెలిపారు. తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్ బి- టీమ్ గా మారిపోయిందని ఆరోపించారు. కమలం కాడకు గులాబీ పువ్వుని అంటు కట్టారని అద్దంకి దయాకర్ అన్నారు.