Congress on Etela: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై ఈటల రాజేందర్ (Etela Rajender) చేసిన ఘాటు విమర్శలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్ లోని ఈటల ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ నాయకలను పోలీసులు అడ్డుకోగా.. కొద్దిసేపు ఈటెల ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మరోవైపు ఈటల కామెంట్స్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ గురించి ఇష్టానుసారం మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు.
బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి దక్కలేదన్న ఆక్రోశంతోనే ఈటల రాజేందర్.. సీఎంపై విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. సీఎం గురించి మాట్లాడిన తీరును సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల ఉన్నపుడే తెలంగాణ ఆర్థికంగా దివాలా తీసిందని ఆరోపించారు. హైడ్రా గురించి మాట్లాడే ఈటెల.. దేవాదాయ శాఖ భూములను కబ్జా కేసు ఆయనపై ఉన్న విషయం మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు.
బీసీ బిడ్డవై కూడా కేసీఆర్ అడుగులకు మడుగులు ఒత్తిన విషయాన్ని ఈటెల మర్చిపోయారా అంటూ టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. కేసీఆర్ హయంలో చేతగాని దద్దమ్మ మంత్రులుగా ఉన్న మీకు.. సీఎం రేవంత్ గురుంచి మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు. తెలంగాణ దివాలా తీయడానికి కారణమైన కేసీఆర్ అలీబాబా చోరిస్ లో ఈటెల ఒకరని ఆరోపించారు. ప్రస్తుతం విద్య, వైద్య పరంగా అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతున్నట్లు చెప్పారు. ఆర్ధిక మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ నేతలు అడుగడుగునా అడ్డు పడుతున్నారని.. బీసీ బిడ్డగా ఈటల రాజేందర్, బండి సంజయ్ ను ఎవరు అంగీకరించే పరిస్థితి లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Also Read: Etela Rajender on TG CM: హైడ్రాతో ఏం సాధించారు.. కూల్చడమే మీ విధానమా.. సీఎంపై ఈటెల ఫైర్!
మరోవైపు సీఎం రేవంత్ పై ఈటెల వ్యాఖ్యలపై.. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chaamala Kiran Kumar Reddy) కూడా తీవ్రంగా స్పందించారు. కమ్యూనిస్ట్ భావాలు కలిగి ఉన్న ఈటెల.. బీజేపీలోకి వెళ్లడం వల్ల ఆయన బుర్ర పనిచేయకుండా పోతోందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో పంచాయతీ పెట్టుకుని బీజేపీలోకి వెళ్లిన ఈటెలకు అక్కడ కూడా నిరాశే ఎదురైందని చామల ఆరోపించారు. బీజేపీ నాయకులు ముందుకు వెళ్లనివ్వడం లేదని అన్నారు. ఆ ఫ్రస్టేషన్ తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డిపై వేయడం సరికాదని అన్నారు. మీ సమస్య అంతా బీజేపీ పార్టీలో ఉంది కాబట్టి అక్కడే తేల్చుకోవాలని అన్నారు. సీఎంను తిడితే పదవులు వస్తాయని ఈటెల భ్రమిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ అన్నారు.