MLC Kavitha: మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ముఖ్యనేత కల్వకుంట్ల కవిత గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. అయితే మే డే రోజున గత పదేళ్ల పాలనపై ఆమె చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ ను ఇరకాటంలో పడేశాయి. అంతేకాదు కవిత త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్రలు చేస్తున్న వారు ఎవరో తనకు తెలుసని ఆమె వ్యాఖ్యానించారు.
దుష్ప్రచారం సరికాదు
మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసమే తాను పనిచేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత అన్నారు. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే చెప్తున్నట్లు పేర్కొన్నారు. ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని మే డే రోజున ప్రస్తావించినట్లు కవిత స్పష్టం చేశారు. పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందన్న కవిత.. ఈ సమయంలో తనపై దుష్ప్రచారం సరికాదని అన్నారు.
ఇంకా నన్ను కష్టపెడతారా?
మీడియాతో చిట్ చాట్ లో తన అరెస్ట్ గురించి ప్రస్తావించిన కవిత.. కాస్త ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోదా… ఇంకా నన్ను కష్టపెడతారా? అంటూ వ్యాఖ్యానించారు. తనను రెచ్చగొడితే గట్టిగా స్పందిస్తానని ఈ సందర్భంగా కవిత వార్నింగ్ ఇచ్చారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీనే స్పందిస్తుందని భావిస్తున్నట్లు కవిత చెప్పారు.
Also Read: India Pakistan Ceasefire: సరిహద్దుల్లో నిశ్శబ్దం.. 19 రోజుల తర్వాత అంతా ప్రశాంతం.. వార్నింగ్ పనిచేసినట్లే!
ఎవరికీ ఆ వార్నింగ్!
తనను రెచ్చగొట్టొద్దని కవిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది. తనను విపక్షాలే రెచ్చగొడుతున్నట్లు కవిత ఎక్కడా చెప్పలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించే కవిత ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నట్లు గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య విభేదాలు వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కవిత మేడే రోజున బీఆర్ఎస్ ను ఇబ్బందిపెట్టేలా వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తాజా వార్నింగ్ కూడా బీఆర్ఎస్ ను ఉద్దేశించే చేశారా? అని నిపుణులు అనుమానిస్తున్నారు.