MLC Kavitha: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న అంశాల విషయంలో ద్వైపాక్షికంగానే ఎప్పుడూ పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడూ లేనివిధంగా అకస్మాత్తుగా అమెరికా ఎందుకు ప్రవేశించి మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చిందో అన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
శనివారం రాత్రి హైదరాబాద్ లోని పాకిస్తాన్ చేసిన దాడుల్లో వీరమరణం పొందిన సైనికులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దేశాన్ని, దేశ ప్రజలను రక్షించడానికి భారత సైన్యం ధైర్యంగా పోరాటం చేసిందని కొనియాడారు.
భవిష్యత్తులో పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండేందుకు మనం ఎంత గట్టిగా నిలవరించగలిగినం అన్న అంశాలపై ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి దేశ ప్రజలకు వివరిస్తే బాగుంటుందని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అన్ని అంశాలపై చర్చించాలని అన్నారు.
Also read: Etela Rajender: కూలిపోవడమే తెలంగాణ ప్రభుత్వానికి మిగిలింది?.. ఈటల రాజేందర్ ఫైర్!
భారత్, పాకిస్తాన్ మధ్య సమస్యలు, అంశాలపై రెండు దేశాలు మాత్రమే కూర్చొని మాట్లాడాలని, ఇతర దేశాల జోక్యం చేసుకోవడం లేదా మధ్యవర్తిత్వం వహించడం సరికాదన్న అభిప్రాయం దేశ ప్రజల్లో ఉండిందని తెలిపారు.
కానీ అకస్మాత్తుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ట్వీట్ చేయడం కొంత బాధ అనిపించిందని అన్నారు. మన ప్రధానమంత్రి ట్వీట్ చేసి ఉంటే మన దేశ గొప్పతనం మరింత పెరిగేదని చెప్పారు.