Pawan Kalyan: ఇదిగో ఈ ఫొటోలో ఉన్న వృద్ధురాలిని చూశారా? ఎవరీమె.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పెద్దావిడ ఎందుకున్నారు? ఆమె ఎందుకంత స్పెషల్ అని అనుకుంటున్నారు కదా.. అవును ఈమె చాలా చాలా స్పెషల్. ఇంకెందుకు ఆలస్యం వృద్ధురాలి గురించి తెలుసుకుందాం వచ్చేయండి. పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలుకు జనసేన, పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని అభిమానం. ఎంతలా అంటే పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలవాలని మొక్కులు కొరుకుని పొర్లుదండాలు పెట్టేంత. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా సరే.. తనకు వచ్చిన పింఛను సొమ్ముతో డబ్బులు పోగేసి గ్రామంలోని వేగులమ్మ తల్లికి అమ్మవారికి గరగ చేయించి సమర్పిస్తానని మొక్కుకొన్నది. పవన్ పిఠాపురం నుంచి గెలవడమే కాకుండా డిప్యూటీ సీఎం కావడంతో పేరంటాలు ఆనందానికి హద్దుల్లేవు. ఈ క్రమంలోనే తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇదే తడువుగా స్థానిక నాయకులు రోజుల వ్యవధిలోనే సేనానిని కలిపించారు.
ఇదీ అసలు సంగతి..
పవన్ కళ్యాణ్ గెలవడమే కాదు.. డిప్యూటీ సీఎం కూడా కావడంతో పేరంటాలు సోమవారం మొక్కు తీర్చుకుంది. 2024లో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో వేగులమ్మ తల్లికి పొర్లుదండాలు పెట్టింది. పవన్‌ను గెలిపించాలని, ఆయన గెలిస్తే అమ్మవారికి గరగ చేయించి సమర్పిస్తానని మొక్కుకొంది. తనకు వచ్చే పింఛను సొమ్ములో రూ.2,500 చొప్పున పోగు చేసింది. ఈ నెలతో మొత్తం రూ.27వేలు కాగా, ఆ సొమ్ముతో అమ్మవారికి గరగ చేయించి సోమవారం సమర్పించింది. ఈ సందర్భంగా స్థానిక నేతలు పేరంటాలును కలిసి మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే తన మనసులోని మాటను బయటపెట్టింది అవ్వ. పవన్ కల్యాణ్‌తో కలిసి బువ్వ తినాలని ఉందని, ఆ బువ్వ తన పింఛను డబ్బుతోనే తయారు చేస్తానని చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం శుక్రవారం రోజు పేరంటాలును తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించారు. ఆఫీసుకు వచ్చిన ఆమె.. పవన్‌ను చూడగానే ఆనందానికి అవధుల్లేవ్. ఒక్కసారిగా ఎమోషనల్ అయిన పవన్‌ను కౌగిలించుకొని ఏడ్చేసింది. అనంతరం అవ్వ, పవన్ ఇరువురూ నులక మంచంపై కూర్చొని.. ఇంటి నుంచి పేరంటాలు తెచ్చిన భోజనాన్ని తిన్నారు. ఈ సందర్భంగా తన అభిమాన అవ్వకు చీరను, లక్ష రూపాయల నగదును పవన్ కళ్యాణ్ అందించారు. అనంతరం క్యాంప్ ఆఫీసు నుంచి స్వయంగా పేరంటాలును చేయి పట్టుకొని బయటికొచ్చి కారు ఎక్కించి, ఇంటికి పంపారు.
పీపుల్స్ లీడర్ అంటూ..
ఇందుకు సంబంధించిన ఫొటోలను ఏపీ డిప్యూటీ సీఎంవో ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నది. ఫొటోలు చూసిన జనసేన అభిమానులు, కార్యకర్తలు, పవన్ వీరాభిమానులు.. సేనానిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నిజమైన ప్రజా నాయకుడికి దక్కే గౌరవం అని కొందరు.. పీపుల్స్ లీడర్ అని మరికొందరు చిత్ర విచిత్రాలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పవన్ అంటే గిట్టని వారు మాత్రం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలియదా? చెప్పులు ధరించి తినడమేంటి? అని విమర్శలు చేస్తున్నారు. ఇంకొందరేమో కామెంట్ల రూపంలో తమ బాధలను చెప్పుకుంటున్నారు. ‘ దాదాపు 6 లక్షలకు పైగా డీఎస్సీ నిరుద్యోగులు మీకు ఓటు వేశారు. మాకు 90 రోజులు కావాలని 3 వారాలు నుంచి రెక్వెస్ట్ చేస్తున్నా పట్టించుకోలేదు. 45 రోజుల అదనపు సమయం ఇస్తే పేద వారికి కూడా న్యాయం జరుగుతుంది. దయచేసి పేదవారికి కూడా అవకాశం ఇవ్వండి’ అని కొందరు డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నారు. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, ఆయన విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి, అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారు. తన పింఛను సొమ్ము నుంచి… pic.twitter.com/CU1lVWKXfo
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 9, 2025