Chiranjeevi: టాలీవుడ్‌లో అతి పెద్ద సక్సెస్ సాధించిన సినిమాల్లో ఒకటి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari). మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. 1990వ సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనంగా మారింది. ఈ ఏడాది ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 9న మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధం చేశారు. 2D, 3D ఫార్మాట్లలో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ గత వారం రోజులుగా మేకర్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు, ఈ సినిమా సీక్వెల్ చేస్తే, ఎవరు హీరోహీరోయిన్లుగా నటించాలో చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా రిలీజై అప్పుడే 35 ఏళ్లు అవుతోందా? అని అనిపిస్తోంది. ఆ మూవీ రోజులు, షూటింగ్‌లో జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంటే ఇప్పుడిప్పుడే జరిగినట్టు అనిపిస్తుంది. శ్రీదేవితో అంతకు ముందు నేను ఓ రెండు చిత్రాల్లో నటించాను. కానీ ఇదే ఫస్ట్ సినిమా అన్నంతగా జనాలు ఫిక్స్ అయిపోయారు. ఆ టైంలో దర్శకేంద్రుడి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ మూవీ అనుకుంటున్న టైంలో చాలా మంది ఆయనతో వద్దు అని సలహాలు ఇస్తూ వచ్చారు. కానీ నేను, దత్ మాత్రం చేస్తే రాఘవేంద్రరావు చేయాలి, లేదంటే అసలు ఈ సినిమానే వద్దు అని అనుకున్నాం. సినిమా రిజల్ట్‌ను బట్టి మనిషి టాలెంట్‌ను అంచనా వేయవద్దు. ఓ టెక్నీషియన్‌గా రాఘవేంద్రరావు ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదు. ఈ మూవీ కోసం ఆయన ప్రాణం పెట్టారు. అందరి ఇన్‌పుట్స్ తీసుకుని ఈ చిత్రాన్ని చెక్కారు.
Also Read- Raghava Lawrence: ఏడాది కష్టం చెదలు పాలు.. లారెన్స్ మనసు కరిగిపోయింది
ఈ మూవీ కోసం 27 మంది రైటర్స్ పని చేశారు. నేను కూడా ఈ మూవీ కోసం రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో 35 రోజులు పని చేశాను. ఇళయరాజా ఈ సినిమా కోసం ప్రతీ పాట మూడు, నాలుగు గంటల్లో కంపోజ్ చేసేశారు. ‘అబ్బనీ తీయని దెబ్బ’ అనే పాట ఉదయం స్టార్ట్ చేస్తే మధ్యాహ్నంకి పూర్తైయిపోయింది. ఈ పాటను ఒకటిన్నర రోజుల్లోనే షూట్ చేసేశాం. అసలు ఈ కథను కొన్ని రోజులు మానస సరోవరం కాకుండా చంద్రమండలం మీద అని అనుకున్నాం. కానీ చివరకు మానస సరోవరం అయితే కాస్త నమ్మశక్యంగా ఉంటుందని అంతా ఫిక్సయ్యాం. ఆ మానస సరోవరాన్ని విజయ వాహినీ స్టూడియోలో దర్శకేంద్రుడు అద్భుతంగా క్రియేట్ చేశారు. ఈ రీ రిలీజ్‌లో శ్రీదేవిని చాలా మిస్ అవుతున్నాం. ఈ రీ రిలీజ్ ఆమెకు అంకితం.
సినిమాకు సంబంధించి ‘దినక్కుతా’ అనే పాటను చివరగా షూట్ చేశాం. ఆ టైంలో నాకు తీవ్ర జ్వరం. కనీసం నిలబడే ఓపిక లేకపోయినా, రిహార్సల్స్ చేసే శక్తి లేకపోయినా ఎలాగోలా షూట్ చేశాం. గుమ్మడి కాయ కొట్టేశారు అని తెలియడంతో ఇక నేను కూలిపోయా. వెంటనే నన్ను ఆ దగ్గరలో ఉన్న విజయ హాస్పిటల్లో చేర్చారు. రెండ్రోజుల తరువాత స్పృహలోకి వచ్చాను. అప్పుడు నాకు మలేరియా ఫీవర్ అని తెలిసింది. మంచి రిలీజ్ డేట్‌ను మిస్ అవ్వవద్దని.. సినిమాకి, నిర్మాతకి, నాకు చాలా నష్టం కలుగుతుందని కష్టమైనా సరే ఎలాగోలా షూటింగ్ చేసేశాను. నిర్మాతలను ఎలా గౌరవించాలనేది ఎన్టీ రామారావు నుంచి నేర్చుకున్నాను. నేను దర్శక, నిర్మాతల్ని అమ్మానాన్నల్లా గౌరవిస్తాను. విన్సెంట్ ఈ చిత్రాన్ని ఓ విజువల్ వండర్‌గా మలిచారు. భూలోకం నుంచి ఇంద్రలోకంలోకి వెళ్లేటప్పుడు గుడిసె పైకప్పు తెరుచుకునే సీన్‌ను ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రం వరకు ఫినిష్ చేశారు. ఇప్పుడు ఆ షాట్ తీయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో!. ఆ టైంలోనే ఆయన వండర్స్ చేశారు.
Also Read- Operation Sindoor Title: ‘ఆపరేషన్ సింధూర్’ టైటిల్ కోసం భారీ పోటీ.. ఓ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇక ఈ చిత్రం కోసం ప్రభుదేవా (Prabhu Deva) చేసిన ‘అబ్బనీ తీయని దెబ్బ’ పాట ఎవర్ గ్రీన్‌గా నిలిచింది. సుందరం మాస్టార్ భయపడుతున్నా కూడా, ప్రభు దేవాని నేను తీసుకుని వెళ్లి పాటలు ఇచ్చేవాడిని. 16 ఏళ్ల వయసులోనే ప్రభుదేవాకి ఉన్న టాలెంట్ ఏంటో నాకు అర్థమైంది. అందుకే నేను ప్రత్యేకంగా ఆయనకు పాటలు ఇస్తుండేవాడిని. ఎంతో శక్తి ఉన్న ఆ రింగుని చేప మింగిన తర్వాత ఏం జరిగింది? అనే పాయింట్‌ను అప్పుడే ఎండ్ కార్డులో వేసి ఉంటే సీక్వెల్ ఎప్పుడో వచ్చేది. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీస్తే అందులో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించాలని ఉంది. ఇక ఆ మూవీని రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ తీస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. అశ్వనీదత్ పిల్లలు ఎలాగూ ఈ సీక్వెల్‌ను నిర్మిస్తారు. ఇప్పటి తరం ఆ మూవీని థియేటర్స్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేసి ఉండరు. ఇప్పటి తరం ఈ రీ రిలీజ్‌ను చూడాలని కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్లి సినిమాను చూడండి అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు