Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలింది. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు పర్యాటకులు దుర్మరణం చెందారు. ఉత్తరకాశీలో అడవుల్లో గంగోత్రి వైపు పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అనంతపురం టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ సోదరి వేదవతి కుమారి(48) మరణించారు. అయితే ఎంపీ బావ భాస్కర్ (51) మాత్రం గాయాలతో బయటపడ్డారు. గాయపడిన భాస్కర్‌ను ఎయిమ్స్ రిషికేష్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో టీడీపీ ఎంపీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఎంపీ కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో ఇవాళ్టి పనులన్నీ మధ్యలోనే ఆపేసిన టీడీపీ ఎంపీ హుటాహుటిన రుషికేశ్‌కు బయల్దేరి వెళ్లారు. మరోవైపు హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంతవరకూ తెలియరాలేదు. కాగా, టెక్నికల్ సమస్య తలెత్తడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తున్నది. రంగంలోకి దిగిన నిపుణులు, అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

మృతుల వివరాలు ఇవే
మరణించిన ఆరుగురిలో ఐదుగురు మహిళలే ఉన్నారు. అందులోనూ ముగ్గురు మహిళలు ముంబైకు చెందిన వారే. పైలట్ కూడా ప్రమాదంలో మరణించారు. కాలా సోని (61) ముంబై, విజయా రెడ్డి (57) ముంబై, రుచి అగర్వాల్ (56) ముంబై, రాధా అగర్వాల్ (79) ఉత్తరప్రదేశ్, వేదవతి కుమారి (48) ఆంధ్రప్రదేశ్, రాబిన్ సింగ్ (60) గుజరాత్ (పైలట్). ఇదిలా ఉంటే ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, ప్రమాదంపై విచారణ జరపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా, ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర కోసం పవిత్ర పుణ్య క్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేధార్‌నాథ్, భద్రీనాథ్ దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు విచ్చేశారు. ఈ యాత్రకు ఎక్కువగా పర్యాటకులు హెలికాప్టర్‌ను ఉపయోగిస్తుంటారు. ఇలా వెళ్తుండగానే హెలికాప్టర్‌లో ప్రమాదం జరగడం బాధాకరం.
Read Also-YS Vijayamma: తల్లి విజయమ్మ నుంచి వైఎస్ జగన్‌కు ఊహించని షాక్?