Seethakka: జీతాల్లో ఎలాంటి కోతలు లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బందితో చేయించుకున్న పనికి వేతనం దక్కేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బందితో భేటీ అయ్యారు. పెండింగ్ జీతాలు విడుదల చేయించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. గత పదేండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను మంత్రి కి వివరించారు. తమను వివిధ కేటగిరీలుగా విభజించడంతో ఎంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అందరినీ ఒకే కేటగిరిగా పరిగణించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. జీతాల్లో కోత విధించేందుకు తెచ్చిన 4779 సర్కులర్‌లను రద్దు చేయాలని కోరారు. మంత్రి సీతక్క స్పందించి సంబంధిత అధికారుల కు ఏపీ విధానాన్ని అధ్యయనం చేసి పరిష్కరించాలని ఆదేశించారు. బడ్జెట్ తో సంబంధం లేని పాలనపరమైన సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది సంఘాలు ప్రతినిధులతో త్వరలో సమావేశ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
సీఆర్టీ ప్రతినిధులతో భేటీ
గిరిజన పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టువల్ రెసిడెన్షియల్ టీచర్స్(సీఆర్టీ) సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, 61ఏళ్ల వరకు సర్వీస్ పొడిగించాలని, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా సకాలంలో జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని, మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ప్రతి ఏడాది రెన్యువల్‌తో నిమిత్తం లేకుండా ప్రభుత్వ టీచర్లకు ఇస్తున్నట్లుగానే ఏడాదిలో 12 నెలల జీతం ఇచ్చే విధానం అమలుచేయాలని కోరారు.
Also read: Sree Vishnu: ‘శ్వాగ్’ రిజల్ట్‌పై హీరో శ్రీ విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
సీతక్క మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. వెంటనే ఫైళ్ళు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గిరిజన ఆశ్రమ విద్యాసంస్థలను ఆధునికరిస్తామన్నారు. మరమ్మతులు, రంగుల కోసం బడ్జెట్ విడుదల చేస్తామన్నారు. ఆదివాసి గిరిజన ఆవాసాల్లో సమస్యలను సీఆర్ టీలు ప్రాథమిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. వాటిని మాకు నివేదిస్తే పరిష్కరిస్తామన్నారు.
అంగన్‌వాడీలకు గుర్తింపుకార్డులు ఇవ్వాలి
తమకు గుర్తింపు కార్డు ఇవ్వాలని మంత్రి సీతక్కకు అంగన్‌వాడీలు విజ్ఞప్తి చేశారు. ఐఎన్‌టియుసి అనుబంధ అంగన్‌వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు బుధవారం భేటీ అయ్యారు. పీఎఫ్ ఆరోగ్య భద్రత వంటి వాటిని తమకు కల్పించాలని వినతి పత్రం అందజేశారు. గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీల పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీ సమస్యలు వినడానికి మా ద్వారాలు ఎప్పుడు తెచ్చుకొని ఉంటాయని అంగన్‌వాడీలకు స్పష్టం చేశారు.