Srinivas on Political Leaders: సామాజిక మాధ్యమాలకు రాజకీయ శక్తి ఉందని రాజకీయ అధినాయకులు భావించడం, న్యూ మీడియా ద్వారా సమాచార వ్యవస్థలో పెను మార్పులు సంతరించుకోవడం అనేది సమాచార వ్యవస్థకు పెను సవాలుగా మారినట్లు ప్రముఖ సంపాదకులు శ్రీనివాస్ పేర్కొన్నారు. మీడియా రంగంలో వస్తున్న కొత్త పోకడల వల్ల పాఠకులకు రెండు విధాల పరిణామాలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు.
గజ్వేల్ ప్రెస్ క్లబ్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా శ్రీనివాస్, విశిష్ట అతిథిగా టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ తో పాటు వివిధ పార్టీల నాయకులు, అధికారులు ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాంతీయ, జాతీయ పార్టీలు సామాజిక మాధ్యమాల ను వాడుకొని తమ భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకుంటున్నాయని, గెలుపోటముల ప్రభావం కూడా చూపుతుందని గుర్తించడం మామూలు అయిందన్నారు.
న్యూ మీడియా స్మార్ట్ ఫోన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి దగ్గరవుతుందని తద్వారా సమాచార వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియా పాఠకుల సంఖ్య మామూలు మీడియా సంఖ్య కంటే అనేక రేట్లు పెరిగిపోతుందన్నారు. న్యూ మీడియా వల్ల పాఠకుడు రైటర్ గా మారడమే కాకుండా భావ వ్యక్తీకరణకు అవకాశం లభిస్తుంది అన్నారు. నచ్చితే లైక్లు నచ్చకపోతే కామెంట్లు పెట్టి తన భావాలను వ్యక్తం చేసే అవకాశాలు పొందుతున్నట్లు పేర్కొన్నారు.
న్యూ మీడియా సమాజానికి వ్యతిరేకంగా ముందుకు సాగుతుందని కొంతమంది భావించడం పై స్పందిస్తూ సాంకేతికపరంగా సాగుతున్న న్యూ మీడియా వల్ల మంచి తో పాటు మిగతా వాటిలాగే చెడు కూడా ఉంటుందని మంచిని ప్రోత్సహించి చెడును నియంత్రించే ప్రయత్నం జరగాలని పేర్కొన్నారు. గతంలో కూడా పెద్ద పత్రికలు, చానల్స్ అవినీతి, బ్లాక్ మెయిల్ ముద్ర లేకుండా ఉన్నాయా, వారిలో సైతం పక్షపాత వైఖరి అవలంబించడం సాధారణమే అని గుర్తు చేశారు.
న్యూ మీడియా వల్ల సమాచారం విస్తృతమవుతూ స్పీడ్ అప్ అయిందని ఎక్కడో ఉన్న సమాచారం క్షణాల్లో మారుమూల ప్రాంతాలకు చేరువవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆరోగ్యకరమైన మీడియా గా మార్చుకోవాల్సిన బాధ్యత సమకాలిక సమాజంపై ఉందని గుర్తు చేశారు.
నిజమైన మీడియాను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం పైనే ఉంది.. విరహత్ అలీ
మీడియా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అసలైన మీడియా వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందని జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ పేర్కొన్నారు. డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ వ్యవస్థ వల్ల జర్నలిజంలో విలేకరుల ఉనికికి ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిజమైన, నకిలీ జర్నలిస్టులు ఎవరో గుర్తించలేని అయోమయ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. చట్టబద్ధంగా కాకుండా విచ్చలవిడిగా మీడియా సంస్థలు పుట్టుకొస్తూ ఇష్టానురీతిగా ప్రవర్తించడం సమాజానికి పెను సమస్యగా మారినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ ఉంటే మీడియా సంస్థ ఏర్పాటు చేసుకొని ఇష్టం వచ్చిన వార్తలు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం మామూలు అయిందని ఇది వాస్తవాలు ఎంతవరకు పరికరంలోకి తీసుకోవడం జరిగిందన్నది ప్రజలు ఎలా నమ్మాలని పేర్కొన్నారు.
ప్రతి పత్రిక, ఛానల్ రాజకీయరంగును పొలుముకున్నాయని యజమాన్యంలో మార్పుతో పాటు మీడియా రంగంలో సమాజానికి అవసరమయ్యే మీడియా వ్యవస్థను రూపొందించే చర్యలు జరగాలని పేర్కొన్నారు.