Raghunandan Rao: మెదక్ (Medak) ఎంపీ రఘునందన్ రావు (Raghunandan) భార్య మంజులా దేవి నమస్తే తెలంగాణ పత్రికకు లీగల్ నోటీస్ ఇచ్చారు. పబ్లిషర్ దామోదర్ రావు, ఎడిటర్ తీగుళ్ళ కృష్ణమూర్తి, రిపోర్టర్ వర్దెల్లి వెంకటేశ్వర్లుకు ఈ నోటీసులు పంపించారు. తమపై తప్పుడు కథనాలు ప్రచురించారని, పది రోజుల్లోగా నిజాలు రాయాలని డిమాండ్ చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.
అసలేం జరిగిందంటే?
దుబ్బాక (Dubbaka) నియోజకవర్గం భూంపల్లి మండలంలోని చౌదరిపల్లిలో అసైన్డ్ భూమి (Assigned Lands) ఉంది. సర్వే నెంబర్ 294లో సేత్వార్, కాస్రాలో దాదాపు 176 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ మేరకు రికార్డులు ఉన్నాయి. ఆ భూమిలో చాలాకాలంగా కొందరు వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. 294/1 నుంచి 294/10 దాకా వారికి బై నెంబర్స్ వేసి 30 ఏండ్ల క్రితం అసైన్డ్ పట్టాలుగా ప్రభుత్వం వారికి పంపిణీ చేసింది. అసైన్డ్ ల్యాండ్స్ అంటే అమ్మడానికి వీలు ఉండదు. అలా కాకుండా విక్రయిస్తే, పీఓటీ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే, ఈ భూముల్లోని 40 ఎకరాల దాకా రఘునందన్ రావు తన కుటుంబసభ్యుల పేర్ల మీదకు మార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.
Read Also- BJP on CM Revanth: సీఎం రేవంత్ పై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్..!
నమస్తే తెలంగాణ కథనంపై ఆగ్రహం
ఏప్రిల్ 30న ప్రభుత్వ అసైన్డ్ భూములు తన కుటుంబ సభ్యుల మీద రఘునందన్ రావు మార్చుకున్నారని నమస్తే తెలంగాణలో కథనం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఆయన భార్య మంజులా దేవి లీగల్ నోటీసులు పంపించారు. దుబ్బాక నియోజకవర్గం చౌదరిపల్లిలో కొన్న భూములు పూర్తిగా రైతుల పట్టా భూములని స్పష్టం చేశారు. బ్యాంక్ ద్వారా డబ్బులు చెల్లించి, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే భూములు కొనుగోలు చేసినట్టు వివరించారు.
హైకోర్టు ఆదేశాలతో కలెక్టర్ విచారణ
ఈ భూముల విషయంలో 13-09-2024న రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు(నెంబర్ 25521) కాగా, వాదనలు విన్న కోర్టు సిద్దిపేట కలెక్టర్ వెంటనే సర్వే నంబర్ 294/4 నుంచి 291/10 వరకు విచారణ చేసి సరైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఆ భూములపై సమగ్ర విచారణ చేశారని, స్థానిక తహసీల్దార్, ఆర్డీవో ఇచ్చిన నివేదికల ఆధారంగా 1953 నుంచి అవి పట్టా భూములే అని 21-04-2025న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
క్షమాపణ చెప్పాలని డిమాండ్
తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ఆ భూములపై విచారణ చేసి రైతుల పట్టా భూములు అని తేల్చిన తర్వాతనే కొనుగోలు చేశామని మంజులా దేవి తెలిపారు. ధరణి పోర్టల్‌లో తప్పుల తడకతో 1952 నుంచి పట్టాలుగా ఉన్న భూమిని ప్రభుత్వ అసైన్డ్ భూములుగా చూపించారని, ధరణిపై కలెక్టర్‌కు రైతులు ఫిర్యాదు చేశారని చెప్పారు. తప్పు జరిగిందని అవి రైతుల భూములే అని కలెక్టర్ ఆనాడు క్లారిటీ ఇచ్చారని అన్నారు. అయినా రాజకీయ కక్షతో రఘునందన్ రావుపై నమస్తే తెలంగాణ తప్పుడు వార్తలు ప్రసారం చేసిందని తెలిపారు. వెంటనే తప్పుడు కథనాలపై క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Read Also- KTR on CM Revanth: చేతకాకుంటే తప్పుకో.. దివాలా మాటలు వద్దు.. సీఎంపై కేటీఆర్ ధ్వజం