KTR on CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై.. బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం దివాల తీసిందంటూ రేవంత్ చేసిన కామెంట్స్.. రాష్ట్ర భవిష్యత్తుకు శాపం పెట్టినట్లు ఉన్నాయని ఆరోపించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్.. సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీని, తమను ఎన్ని తిట్టినా ఊరుకున్నామన్న కేటీఆర్… తెలంగాణ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే మాత్రం అసలు ఊరుకోమని స్పష్టం చేశారు.
అడ్డగోలు హామీలు
ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు కేసీఆర్ (KCR) చిలుకకు చెప్పినట్లు చెప్పారని తాజా ప్రసంగంలో కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలు.. నేడు అక్షరసత్యాలు అయ్యాయని పేర్కొన్నారు. పరిపాలన చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి.. కాడి కింద పడేశారని అన్నారు. రేవంత్‌రెడ్డి అసమర్ధత, దక్షతలేని తనం నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చి.. ఇప్పుడు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
పైసలు లేవా?
ఉద్యమంలో కదం తొక్కిన ఉద్యోగులను సీఎం రేవంత్‌రెడ్డి అవమానిస్తున్నాని కేటీఆర్ విమర్శించారు. ఉద్యోగులకు, ప్రజలకు మధ్య చిచ్చుపెట్టేలా రేవంత్‌రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నారని, రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసలు లేవా? అంటూ నిలదీశారు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్న కరెంట్, మంచినీళ్లు.. ఇప్పుడెందుకు రావట్లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెట్టామని.. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రానికి రూపాయి కూడా ఆదాయం పెంచలేకపోయిందని ఆరోపించారు.
జీరో శాతం గ్రోత్ రేట్
అప్పుల విషయానికి వస్తే తెలంగాణ దేశంలోనే 28వ స్థానంలో ఉందని పార్లమెంటులో కేంద్రమే చెప్పిందని కేటీఆర్ గుర్తుచేశారు. గడిచిన పదేళ్లలో తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గుర్తు చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌లో 2023-24లో 14,295 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2024-25 నాటికి రూ.14 వేల కోట్లు మాత్రమే వచ్చిందని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాల వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పాలనలో జీరో శాతం గ్రోత్ రేట్‌తో తెలంగాణ అట్టడుగున స్థానంలో ఉందని పేర్కొన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ సభలో రూ.71 వేల కోట్ల ఆదాయం తగ్గిందని సీఎం రేవంత్ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు.
రూ.43 కూడా తీసుకురాలేదు
ఢిల్లీ పోతే అపాయింట్ మెంట్లు కూడా ఇవ్వట్లేదని సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ పైనా కేటీఆర్ విరుచుకుపడ్డారు. 43 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్.. రూ.43 కూడా తీసుకురాలేదని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ ట్రిప్ ఫోటోలన్నీ బయటపెడతామని పేర్కొన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పే రేవంత్ రెడ్డి.. ఆయన కుటుంబ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయో చెప్పాలని నిలదీశారు. ఫార్మా కంపెనీల పేరుతో వేల కోట్ల విలువైన లగచర్ల భూములను స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి చెందిన జూబ్లిహిల్స్ ప్యాలెస్ మూడింతలు పెరిగిందని.. 2 వేల ఎకరాలు సైతం సీఎం కొన్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఆదాయం ఎందుకు తగ్గుతోంది? రేవంత్ కుటుంబం ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి? చెప్పాలని నిలదీశారు.
Also Read: RTC Strike Postponed: చర్చలు సఫలం.. వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీ.. సమ్మె లేనట్లే
రేవంత్.. రాజీనామా చేయాలి
సీఎం రేవంత్ రెడ్డి తన 17 నెలల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పాలన చేతగాని రేవంత్.. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరిపాలన అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదని కేటీఆర్ అన్నారు. ఒకవైపు దివాలా మాటలు మాట్లాడుతూ.. మరోవైపు తెలంగాణ రైజింగ్ అనటం ఏంటని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేసేటందుకు డబ్బులు లేవు కానీ.. అందాల పోటీలకు నిర్వహించేందుకు పైసలుంటాయా? అని నిలదీశారు. పరిపాలన చేతగాకపోతే తప్పుకోవాలని సూచించారు.