RTC Strike Postponed: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)తో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (RTC JAC) జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం (Kodandaram), సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు లతో అనేక అంశాలపై చర్చించినట్లు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వం తమ డిమాండ్ లపై సానుకూలంగా స్పందించడంతో సమ్మెపై వెనక్కి తగ్గినట్లు స్పష్టం చేసింది.
పంతాలకు పోకూడదని..
ప్రస్తుతం భారత్ – పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వం వివరించినట్లు జేఏసీ నేతలు తెలిపారు. దీంతో పంతాలు పట్టింపులకు పోకుండా సమ్మెను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అయితే ఆర్టీసీ యూనియన్లపై పెట్టిన ఆంక్షలను తొలగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరినట్లు జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తులు
అలాగే ఆర్టీసీలోని అన్ని విభాగాల్లోని ఖాళీలను పూర్తి చేయాలని కోరినట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఉద్యోగ భద్రతపై సర్క్యూలర్ జారీతో పాటు విద్యుత్ బస్సులు నేరుగా ఆర్టీసీకే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. అలాగే కారణ్య నియామకాలను కూడా చేపట్టాలని సూచించినట్లు చెప్పారు. 2019 సమ్మే సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులపై నమోదైన పోలీస్ కేసులను తొలగించాలని కోరినట్లు వివరించారు. అలాగే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడంపైనా చర్చించినట్లు చెప్పారు. అయితే విడతల వారీగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది.
Also Read: TG Heavy rains: చల్లని కబురు.. రాష్ట్రంలో 5 రోజులు వర్షాలే వర్షాలు!
సమస్యలపై కమిటీ ఏర్పాటు
మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యను పరిష్కరానికి ముగ్గురు ఐఏఎస్ లతో కూడిన కమిటీ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఏర్పాటు చేసింది. నవీన్ మిత్తల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్‌లతో కూడిన ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది. తద్వారా పరిష్కార మార్గాలను సూచిస్తూ వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. తమ డిమాండ్ల సాధన కోసం మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామని టీజీఎస్ఆర్టీసీ ఐకాస గతంలోనే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరగనున్నాయి.