Ponnam Prabhakar: ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. సమస్యలు తొలిగిపోతున్నాయి.. సమ్మె చేయవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో సోమవారం ఆర్టీసీ జేఏసీ చైర్మన్, టీఎంయూ జనరల్ సెక్రెటరీ అశ్వద్ధామ రెడ్డి, ఎన్ఎంయూ జనరల్ సెక్రెటరీ నరేందర్ ,కార్మిక సంఘ్ జనరల్ సెక్రెటరీ ఎర్ర స్వామి కుమార్, ఎస్టీఎంయూ జనరల్ సెక్రెటరీ పున్న హరి కృష్ణ పలువురు ఆర్టీసీ సంఘాల నేతలు మంత్రితో భేటీ అయ్యారు. ఆర్టీసీ సమస్యలను మంత్రి కి వివరించారు.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. ఆర్టీసీ సమస్యల పై, ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు.. మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేశారు. సమస్యలు వినడానికి నేను, మా ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Also Read: Drinking water: తాగునీటి సమస్యలపై తక్షణ స్పందన అవసరం.. సీఎస్ అధికారులకు ఆదేశాలు!
ఆర్టీసీ కి 16 నెలలు గా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామని, ఒక్కటైన ఇబ్బంది పెట్టమా? అన్నారు. ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు ఆర్టీసీని నిర్వీర్యం చేసిందన్నారు. ఒక్క బస్సు కొనుగోలు చేయలేదు ,ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు కూడా వాడుకున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ.400 కోట్లు చెల్లించామన్నారు.
2017 పే స్కేల్ 21% శాతం ఇచ్చిందని, సంవత్సరానికి 412 కోట్లు భారం పడుతుందన్నారు. పీఎఫ్ ఆర్గనైజేషన్ సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న 1039 కోట్లు చెల్లించామన్నారు. నెలవారీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ జనవరి-2024 నుంచి క్రమం తప్పకుండా చెల్లించనున్నట్లు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న సీసీఎస్ బకాయిలు ఉద్యోగులకు 345 కోట్లు రూపాయలు చెల్లించామన్నారు.
నెలలవారీ సీసీఎస్ కంట్రిబ్యూషన్ జనవరి-2024 నుంచి క్రమం తప్పకుండా చెల్లించడం జరుగుతుందన్నారు. 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టామన్నారు. ప్రభుత్వం ఆర్టీసీలో 3038 మంది ఉద్యోగులను రిక్రూట్‌మెంట్ చేయడానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు. కొత్త బస్సులు కొనుగోలు చేశామని, తార్నాక ఆసుపత్రి ను సూపర్ స్పెషాలిటీ గా మార్చామని వెల్లడించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు