Baldia Female Sweepers: కుటుంబ పోషణ కోసం అర్థరాత్రి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మెయిన్ రోడ్లను ఊడ్చతూ, మనం నిద్రలేచే సరికి అద్దంలా మెరిపిస్తున్న మహిళా స్వీపర్లు అనేక రకాల వేధింపులకు గురవుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. నిద్రలేవగానే నగర వాసులు ఆరోగ్యం కోసం వాకింగ్, జాగింగ్ లు చేస్తుంటే ఈ స్వీపర్లు మాత్రం దుమ్మూ, దూళిని పీల్చుతూ అనేక రకాలుగా అనారోగ్యం పాలవుతున్నారు. తాను కొవ్వత్తులా కాలుతూ, ఇతరులకు వెలుగునివ్వాలని నానుడ్ని నిజం చేస్తూ ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న మహిళా స్వీపర్ల పరిస్థితి సెలవు అడిగితే ఉద్యోగం ఊస్ట్ అయ్యేలా తయారైంది.
ఒక్కో స్వీపింగ్ యూనిట్ లో ఏడుగురు కార్మికులు, ప్రతి మూడు యూనిట్ లకు ఓ శానిటరీ ఫీల్డు అసిస్టెంట్ (ఎస్ఎఫ్ఏ) ఉండాలి. కానీ కొన్ని యూనిట్ లలో కేవలం నలుగురు, అయిదుగురు కార్మికులతో కనీసం వీక్లీ ఆఫ్ ఇవ్వకుండా నులు చేయిస్తూ ఎస్ఎఫ్ఏలు, మెడికల్ ఆఫీసర్లు కుమ్మక్కై శ్రమ దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మహానగరంలోని కోటిన్నర మంది జనాభాకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీలో పాలక మండలి పెద్దలు మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు అతి ముఖ్యమైన ఆర్థిక విభాగంతో పాటు ఇతర ల విభాగాధిపతులంతా మహిళలే అయినా మహిళా స్వీపర్లకు అన్యాయం జరగకపోవటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెల్లవారఝము వరకు మెయిర్ రోడ్లు, సబ్ రోడ్లు, కాలనీ రోడ్లన్నీ శుభ్రపరిచే మహిళా కార్మికులను సెలవుల్లేకుండా పని చేయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Also Read: Telangana Students: కామన్ కోర్సుల పై విద్యార్థుల చిన్నచూపు.. కారణం అదేనా!
నేపథ్యంలో ఏడాది క్రితం అప్పటి కమిషనర్ వీరికి వారానికోసారి వీక్లీ ఆఫ్ ఇవ్వాలని జారీ చేసిన సర్క్యులైర్ ను సైతం అధికారులు బుట్టదాఖలు చేస్తూ స్వీపర్లకు సెలవులివ్వటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో యూనిట్ లో ముగ్గురు, నలుగురు కార్మికులను తక్కువగా నియమించి, వారి జీతాలను క్లెయిమ్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఈ రకమైన దోపిడీతో ఇప్పటి వరకు చాలా మంది ఎస్ఎఫ్ఏలు దొరికిపోయినా, దోపిడీకి సూత్రధారి అయిన మెడికల్ ఆఫీసర్లు చిక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహారిస్తున్నట్లు సమాచారం.
సింహాభాగం కార్మికులు మహిళలే
ఒక్క శానిటేషన్ విభాగంలోని 18 వేల 500 పై చిలుకు కార్మికులు విధులు నిర్వహిస్తుండగా, వీరిలో సింహాభాగం అంటే సుమారు 15 వేల పై చిలుకు మహిళలే ఉన్నారు. మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా శ్రీలత శోభన్ రెడ్డి, ఫైనాన్స్ విభాగం హెడ్ గా గీతా రాధిక, ఎలక్షన్ వింగ్ హెడ్ గా మంగతాయారు, విజిలెన్స్ అదనపు కమిషనర్ గా సరోజ, కమాండ్ కంట్రోల్ ఇన్ ఛార్జిగా అనురాధ వంటి మహిళా అధికారులు టాప్ క్యాటగిరిలో కీలక విధులు నిర్వహిస్తున్నా, క్షేత్ర స్థాయిలో మహిళా స్వీపర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు వెలుగులోకి రావటం లేదు.
పైగా జీహెచ్ఎంసీలో మహిళా అధికారులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ కమిటీ ఉన్నా, ఆ కమిటీని నియమించినట్లు మహిళా స్వీపర్లు సమాచారమే లేదు. ఒక వేళ ఉన్నా, వారిని ఈ కమిటీ పట్టించుకోవటం లేదు. కారణంగా క్షేత్ర స్థాయిలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, శానిటరీ జవాన్లు, మెడికల్ ఆఫీసరు, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ల చేతిలో మహిళా స్వీపర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిసింది. అత్యవసర పరిస్థితుల్లో సెలవులు అడిగిన స్వీపర్లను ఏకంగా ఉద్యోగం మానుకోమని పలువురు మెడికల్ ఆఫీసర్లు సూచించటంతో సదరు స్వీపర్లు కన్నీరుమున్నీరయ్యారు.
కమిషనర్ సర్య్యులర్ బుట్టదాఖలు
మహిళా కార్మికులకు వారంలో ఓ రోజు వీక్లీ హాలి డేను అమలు చేయాలని కమిషనర్ సర్క్యులర్ ఉంన్నా, శానిటేషన్ విభాగంలోని కొందరు అధికారులు తాజాగా సరి కొత్త కండీషన్ ను తెరపైకి తెచ్చారు. ఈ కండీషన్ తో నగరంలోని మొత్తం 30 సర్కిళ్ల పరిధిలో తెల్లవారే కల్లా వీధులను,రోడ్లను శుభ్రపరిచే సుమారు 18 వేల పై చిలుకు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్మికులంతా వారంలో ఆరు రోజులు డ్యూటీ చేస్తేనే వీక్లీ ఆఫ్ ఇవ్వాలని, పని చేయాల్సిన ఆరు రోజుల్లో ఏ ఒక్క రోజు డుమ్మా కొట్టినా, సెలవు పెట్టుకున్నా, వీక్లీ ఆఫ్ ను కట్ చేయటంతో పాటు సెలవు పెట్టుకున్న రోజుతో పాటు రద్దయ్యే వీక్లీ ఆప్ తో కలుపుకుని రెండు రోజుల జీతాల్లో కోతలు విధిస్తున్నట్లు కార్మికులు వాపోతున్నారు.
పైగా ఒక్కో రోజు ఒక్కో కార్మికురాలికి వీక్ ఆఫ్ ఉండాలన్న నిబంధన ఉన్నా, ఏడుగురు కార్మికులు ఉండాల్సిన ఒక్కో యూనిట్ లో తక్కువ కార్మికులను నియమించి, వారికి కనీసం వీక్లీ ఆఫ్ లు లేకుండా పనులు చేయిస్తూ, మెడికల్ ఆఫీసర్లు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒకరికి సెలవు అవసరమైతే, మరో కార్మికురాలి వీక్ ఆఫ్ ను వినియోగించుకుని, సెలవు తీసుకుని, తిరిగి సదరు కార్మికురాలి వీక్ ఆఫ్ రోజు సెలవు తీసుకున్న కార్మికురాలు డ్యూటీ లు చేసుకునే వారు. కానీ కమిషనర్ సర్క్యులర్ ను బుట్టదాఖలు చేస్తూ మెడికల్ ఆఫీసర్లు సరి కొత్త నిబంధనను తెరపైకి తెచ్చి మహిళా స్వీపర్లను వేధిస్తున్నట్లు సమాచారం.
Also Read: Vishaka Double Murder Case: జంట హత్యల కేసులో సంచలన నిజాలు.. ఇంటర్నేషనల్ క్రిమినల్ అరెస్ట్