GHMC Corporators: అయిదేళ్లు పదవీకాలం దగ్గరపడుతుంది. సమయం లేదు మిత్రమా, చివరి రోజుల్లోనైనా కాస్త సంపాదించుకోవాలన్న ఆరాటంతో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు. 2020 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చిన ప్రస్తుత జీహెచ్ఎంసీ కౌన్సిల్ పదవీకాలం మరో పది నెలల్లో అంటే రానున్న ఫిబ్రవరి 11వ తేదీతో ముగియనుంది. దీంతో చివరి రోజుల్లోనైనా అందినంత సంపాదించుకునేందుకు పలువురు కార్పొరేటర్లు బరి దెగించి వ్యవహారిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా గ్రేటర్ లోని 150 డివిజన్లలో ఏక్కడైనా ఎవరైనా కొత్తగా ఇళ్లు నిర్మించుకునేందుకు ఇసుక, కంకర, ఇటుకలు వేసినా, క్షణాల్లో కార్పొరేటర్ అనుచరగణం ప్రత్యేక్షమై కార్పొరేటర్ పిలుస్తున్నారంటూ కబురిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి కావల్సిన అన్ని రకాల అనుమతులు చట్టపరంగా తీసుకున్నా, డివిజన్ స్థాయిలో కార్పొరేటర్ ట్యాక్స్ చెల్లించాల్సిందేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఇదివరకు అడపాదడపా జరిగినా, ఇపుడు కార్పొరేటర్ల పదవీ కాలం ముగింపు దగ్గర పడుతున్నందున ఇలాంటి ఘటనలు రోజుకి ఏదో ఒక డివిజన్ లో చోటుచేసుకుంటున్నాయి.
Also Read: Congress Leaders: గ్రూపు రాజకీయాలతో కాంగ్రెస్ పరేషాన్ .. వారికే పదవులా?
ఇలాంటి వ్యవహారానికి సంబంధించి రెండు రోజుల క్రితం ఓ కార్పొరేటర్ ఆబిడ్స్ మున్సిపల్ ఆఫీసులోని టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై దాడికి దిగారు. దీంతో మున్సిపల్ సిబ్బంది దాడికి నిరసనగా విధులను బహిష్కరించటంతో వెంటనే ప్రధాన కార్యాలయం అధికారులు జోక్యం చేసుకుని, బాధితులు, వారికి అండగా నిలిచిన యూనియన్ నేతలతో మాట్లాడి, దాడికి పాల్పడిన కార్పొరేటర్ పై కేసును నమోదు చేయించటంతో పాటు దాడికి సంబంధించిన సకాలంలో ఉన్నతాధికారులకు సమాచామివ్వనందుకు బాధ్యుడ్ని చేస్తూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒకరికి షోకాజ్ నోటీసు కూడా జారీ చేసినట్లు సమాచారం.
కార్పొరేటర్ల అక్రమార్జనకు కారణాలేమిటీ?:
ఎన్నికల్లో తాము కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేసి, కార్పొరేటర్లుగా గెలిచామని చెప్పుకునే కార్పొరేటర్లలో కొందరు ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్సుల నిర్మాణదారుల నుంచి లంచాలు వసూలు చేసేందుకు కారణమేమిటీ?అంటూ పలువురు కార్పొరేటర్లను ప్రశ్నించగా, ప్రతి సంవత్సరం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కు రూ.కోటి వార్షిక బడ్జెట్ ఉండేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కార్పొరేటర్ బడ్జెట్ లేకపోవటంతో తమ ఖర్చులెలా సమకూర్చుకోవాలంటూ బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.
తమకు కారు, డ్రైవర్, ఓ అసిస్టెంట్ తో పాటు అనుచరగణాన్ని ఎవరు పోషించాలంటూ మరి కొందరు కార్పొరేటర్లు వ్యాఖ్యానించారు. అక్రమ నిర్మాణాలు, ఫుట్ పాత్ ల కబ్జాలతో పాటు సర్కారు స్థలాల కబ్జా వంటి వ్యవహారాలకు సంబంధించి ప్రతి రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడో ఓ చోట కార్పొరేటర్ల ఆగడాలు జరుగుతున్నా, అవి అవి వెలుగులోకి రావటం లేదు.
కార్పొరేటర్ ట్యాక్స్ చెల్లించకుంటే:
డివిజన్లలో ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా, వెంటనే సైటుకు వెళ్లే కార్పొరేటర్ అనుచరులు యజమానిని కార్పొరేటర్ రమ్మన్నారంటూ కబురు చేరవేస్తున్నారు. దీంతో ఏం జరిగిందోనన్న ఆందోళనతో కార్పొరేటర్ ను కలిసే యజమానిని నిర్మాణానికి సంబంధించిన అనుమతి పత్రాలను చూపించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అన్నిరకాల అనుమతులున్నా, ఫ్లోర్ కు లక్ష రూపాయల చొప్పున కార్పొరేటర్ ట్యాక్స్ చెల్లించాల్సిందేనని వత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
కార్పొరేట్ ట్యాక్స్ చెల్లించని యజమానులను రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి యజమానులను టార్గెట్ చేస్తూ, కార్పొరేటర్లు స్థానిక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను పిలిపించి, నిర్మాణ పనులను నిలిపివేసేలా నోటీసులు జారీ చేయిస్తున్నట్లు సైతం ఆరోపణల్లేకపోలేవు. దీంతో భయాందోళనకు గురవుతున్న యజమానికి కార్పొరేటర్ కు ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయంలో అధికారులు సైతం మీకు అనుమతి ఉన్నా, మీరు నిర్మాణం చేపట్టేందుకు వీల్లేదని, మీ కార్పొరేటర్ తో మాట్లాడుకోవాలంటూ భవన యజమానులకు సూచించటం గమనార్హం.
పర్మిషన్లు చెక్ చేసేందుకు వీరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లా?:
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిళ్లలో నిర్మాణాలు చేపట్టేందుకు అంతస్తులను బట్టి, సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయంలో భవన యజమానులు ఫీజులు చెల్లించి పర్మిషన్లు తీసుకుంటున్నారు. కానీ నిర్మాణాలు జరుగుతున్న సైటు కెు వెళ్లే కార్పొరేటర్లు భవన నిర్మాణ అనుమతులను చెక్ చేస్తున్నట్లు, ఈ రకమైన తనిఖీలు నిర్వహించేందుకు వీరేమైనా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వీరికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూడా అండగా ఉండటంతో నిర్మాణదారులపై కార్పొరేటర్ల దౌర్జన్యాలు పెరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఇరుగు పొరుగు వారికెలాంటి సమస్యలు రాకుండా నిర్మాణాలు చేపడుతున్నా, కార్పొరేటర్లు అడ్డుకుని, భారీగా లంచాలకు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
Also Read: BRS Membership: గులాబీ గూటిలో కొత్త గుబులు.. ఆ బాధ్యతలు ఎవరికో?
ఇటీవలే తార్నాకలో నిర్మిస్తున్న ఓ భవనానికి సంబంధించి పాలక మండలిలో కీలక బాధ్యతలు నిర్వర్తించే ఓ ప్రజాప్రతినిధి అనుచరుల భవనం వద్దకు వచ్చి, బిల్డింగ్ నిర్మాణం పర్మిషన్లు తీసుకుని రావాలని సూచించినట్లు తెలిసింది. తీరా వెళ్లిన తర్వాత ఒక్కో ఫ్లోర్ కు రూ.లక్ష డిమాండ్ చేయటంతో యజమానికి ఆశ్చర్యానికి గురైనట్లు సమాచారం. ప్రజా సేవలకుమని, ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన ఈ కార్పొరేటర్లు ఈ రకమైన వసూల్లకు పాల్పడటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.