Bhoodan Land Case: భూదాన్ భూముల కేసులో ఇటీవల ఈడీ అధికారులు సీపీఐ నేత శంకర్ నాయక్ ను కలవటంపై అధికారవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో భూదాన్ భూములకు సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి లక్షల రూపాయలు కొల్లగొట్టిన శంకర్ నాయక్ నుంచి వివరాలు తీసుకోవటంపై కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయా కేసుల లోతుల్లోకి వెళ్లి విచారణ జరిపే ఈడీ అధికారులకు ఈ విషయం తెలియదా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి నాగారం గ్రామంలో ఉన్న 42 ఎకరాల 33 గుంటల భూదాన్ భూములను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులతో కలిసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి సేల్ డీడ్లు చేయించుకున్నారంటూ కొంతకాలం క్రితం మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు మహేశ్వరం పోలీసులు ఖదీరున్నీసా, మునావర్ ఖాన్ తోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. ఆ తరువాత ఇదే కేసులో ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. దీంట్లో భాగంగా ఇటీవల ఖదీరున్నీసా, మునావర్ ఖాన్, మహ్మద్ లతీఫ్ షర్ఫన్, మహ్మద్ అక్తర్ షర్ఫన్, మహ్మద్ షుకూర్ నివాసాలు, ఫార్మ్ హౌసుల్లో తనిఖీలు చేశారు. పలు డాక్యుమెంట్లు సీజ్ చేశారు.
ఇక, నాగారంలోని భూదాన్ భూములను ఖదీరున్నీసాతోపాటు మిగితా నిందితులు కలిసి పూర్వీకుల భూమి అని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యగుల సహకారంతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేయటంతోపాటు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి భూములను అమ్మినట్టుగా తేలిందన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను డీనోటిఫై చేసి మరీ ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించినట్టుగా వెల్లడైందని తెలియచేశారు.
Also Read: Gadwal Congress Conflict: గద్వాల కాంగ్రెస్ లో రాజుకుంటున్న చిచ్చు.. రోడ్డెక్కుతున్న నేతలు!
ఇంతవరకు బాగానే ఉన్నా భూదాన్ భూముల కేసులో సమాచారం కోసం శంకర్ నాయక్ ను ఈడీ అధికారులు కలవటం పోలీసువర్గాల్లోనే చర్చకు దారి తీసింది. నిజానికి శంకర్ నాయక్ పై దాదాపు 13 సంవత్సరాల క్రితం భూదాన్ భూములకు సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి పలువురిని మోసం చేసి లక్షలు వెనకేసుకున్నట్టుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. దీనిపై పోలీసు వర్గాలను ఆరా తీయగా తనను తాను సర్వోదయ మండల్ అధ్యక్షునిగా చెప్పుకునే శంకర్ నాయక్ 2011లో ఆదిబట్లలోని భూదాన్ భూముల్లో పట్టాలు ఇప్పిస్తానని చెప్పి రెండు వందల మంది నుంచి 42లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలిసింది.
పలువురు ఆటోడ్రైవర్లు, రోజు కూలీలను ఉచ్చులోకి లాగిన శంకర్ నాయక్ అతని సహచరులు ఒక్కొక్కరి నుంచి 20వేలు మొదలుకుని 50వేల రూపాయల వరకు వసూలు చేసినట్టుగా తేలింది. ఆ తరువాత భూదాన్ ట్రస్ట్ బోర్డు నుంచి జారీ అయినట్టుగా ఫోర్జరీ చేసిన సర్టిఫికెట్లు తయారు చేసి వీరందరికి ఇచ్చినట్టుగా తెలియవచ్చింది. దీని కోసం నకిలీ రబ్బర్ స్టాంపులను కూడా తయారు చేయించినట్టుగా తెలిసింది.
ఆ తరువాత తమకు ఇచ్చినవి నకిలీ పట్టాలని తేలటంతో బాధితులు తమ డబ్బు తమకు వాపసు చేయమని అడిగితే శంకర్ నాయక్ అతని సహచరులు దిక్కున్న చోట చెప్పుకొమ్మని వారిని వెనక్కి పంపించి వేసినట్టుగా వెల్లడైంది. దాంతో బాధితులు 2012, అక్టోబర్ నెలలో ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు శంకర్ నాయక్ తోపాటు అతని సహచరులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించినట్టుగా స్పష్టమైంది.
ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపించినా:
సింగరేణి కాలనీ ప్రాంతంలో ఉంటున్న కొంతమందితో మాట్లాడగా భూదాన్ భూములే కాదు…ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపించినా శంకర్ నాయక్ తనదైన శైలిలో డబ్బు సంపాదించుకునే వాడని చెప్పారు. ఆటోడు నడుపుకుంటూ, రోజువారీ కూలీలు, చిరు ఉద్యోగులతో ఆయా భూముల్లో గుడిసెలు వేయించేవాడని తెలిపారు. నాది కమ్యూనిస్టు పార్టీ…మా పార్టీ మీకు అండగా ఉండి పట్టాలు ఇప్పిస్తుందని నమ్మించే వాడన్నారు.
ఇలా జనాన్ని వలలోకి లాగి ఒక్కో గుడిసెకు 20 నుంచి 50 వేల రూపాయల వరకు వసూలు చేసేవాడని వివరించారు. సింగరేణి కాలనీలో కూడా ఇలానే పదుల సంఖ్యలో గుడిసెలు వేయించినట్టు చెప్పారు. ఈ క్రమంలో ఆయనపై సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైనట్టు తెలిపారు. పాపిరెడ్డి కాలనీ, తారామతిపేట, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో దందాలు చేసినట్టుగా చెప్పారు.
Also Read; Mahabubnagar District: ఈ ప్రాజెక్ట్ కు మోక్షమెప్పుడో.. రైతన్నల ఎదురు చూపులు!
భూదాన్ భూములను అడ్డం పెట్టుకుని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి లక్షల రూపాయలను కొల్లగొట్టి అరెస్ట్ కూడా అయిన శంకర్ నాయక్ ను ఈడీ అధికారులు కలవటం తమను సైతం విస్మయానికి గురి చేసిందని పలువురు వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తి అధికారులకు ఏం సమాచారం ఇవ్వగలడన్నారు. ఇచ్చిన సమాచారంలో నిజం ఎంత ఉంటుంది? అని ప్రశ్నించారు.
భూదాన్ భూముల అక్రమాలను పూర్తిగా బయటకు తీయాలంటే శంకర్ నాయక్ ను కూడా విచారణ జరపాలన్నారు. అప్పుడే నిరుపేదలకు చెందాల్సిన భూములను ఎవరు? ఎలా? దక్కించుకున్నారన్న వివరాలు వెలుగు చూస్తాయని చెప్పారు. ఈ దిశగా ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.