Miss World Contestants: ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు, సమర్థులైన డాక్టర్లతో తెలంగాణ రాష్ట్రం (Telangana Govt).. అంతర్జాతీయ రోగులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో జరగనున్న మిస్ వరల్డ్ (Miss World 2024)పోటీల ద్వారా ప్రపంచ వైద్య పర్యాటక పటంలో తెలంగాణను కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 120 దేశాల ప్రతినిధులు, 150 కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమయ్యే ఈ వరల్డ్ ఈవెంట్ లో రాష్ట్ర మెడికల్ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఆ దిశగా అడుగులు వేస్తోంది.
ఈ నెల 16న ఈవెంట్
తెలంగాణలో తక్కువ ఖర్చుతో అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలను.. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ల ద్వారా యావత్ ప్రపంచానికి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయబోతోంది. ఇందులో భాగంగా ఈ నెల 16న హైదరాబాద్ AIG హాస్పిటల్ లో మెడికల్ టూరిజం ఈవెంట్ ను అధికారులు నిర్వహించబోతున్నారు. దీనికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు ముఖ్య అతిథులుగా రానున్నారు. అమెరికా, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే తెలంగాణలో చికిత్స ఖర్చులు 60-80% తక్కువన్న విషయాన్ని ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచ దేశాలకు తెలంగాణ ప్రభుత్వం తెలియజేయనుంది.
తక్కువ ధరకే ఖరీదైన వైద్యం
అమెరికా తదితర పాశ్చాత్య దేశాలలో హార్ట్ సర్జరీకి/ బై పాస్ సర్జరీకి లక్ష డాలర్లు అవుతుండగా హైదరాబాద్ లో మాత్రం కేవలం 5-10 వేల డాలర్లు మాత్రమే ఖర్చు అవుతున్నాయి. మోకాలు నీ రీప్లేస్ మెంట్ సర్జరీకి వెస్ట్రన్ కంట్రీలలో 40-60 వేల డాలర్లు అవుతుండగా.. హైదరాబాద్ లో మాత్రం 5 వేల డాలర్ల లోపే అవుతున్నాయి. డెంటల్ సమస్యలకు విదేశాలలో 5 వేల డాలర్లు అవుతుండగా మన దగ్గర వెయ్యి డాలర్ల లోపే ఖర్చు అవుతోంది. అందుకే విదేశాల నుండి వైద్య అవసరాలకు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ వస్తున్నారు.
సంప్రదాయ వైద్యంపైనా
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో అనేక ఆసుపత్రులు అత్యుత్తమ వైద్య చికిత్సగా గుర్తింపుగా భావించే JCI (జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్) , NABH అక్రెడిటేషన్లను సాధించాయి. ఇది రోగుల నమ్మకాన్ని మరింతగా పెంచింది. ఆధునిక వైద్యంతో పాటు భారత సంప్రదాయ వైద్య విధానాల పట్ల విదేశీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ వైద్య విధానాలైనా ఆయుర్వేద, హోమియో, యునాని పై కూడా ప్రచారం నిర్వహించేందుకు, వాటి ప్రయోజనాలను తెలిపేందుకు తద్వారా భారత సంప్రదాయ వైద్య సేవలను విదేశీయులకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
ప్రపంచ స్థాయికి..
తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన చికిత్సలు, అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు, నిపుణులు, కనీస నిరీక్షణ సమయాలు, ఇంగ్లీష్ మాట్లాడే సిబ్బంది , కమ్యూనికేషన్ సౌలభ్యం, ప్రభుత్వ మద్దతు ఇలా చాలా అంశాలు తెలంగాణ మెడికల్ టూరింజాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం నుండి రోగులను ఈ మిస్ వరల్డ్ పోటీల ద్వారా ఆకర్షించగలిగితే రాష్ట్రంలోని మెడికల్ టూరిజం మరింతగా అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు.
Also Read: Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్లపై భారీ గుడ్ న్యూస్.. పంపిణీపై మంత్రి కీలక అప్ డేట్
గణనీయంగా పెరిగిన విదేశీ పేషెంట్లు
2014 సంవత్సరంలో 75 వేల 171 మంది విదేశీయులు.. వైద్య సేవలు పొందేందుకు హైదరాబాద్ కి వచ్చారు. 2024కి వచ్చే సరికి అది 1,55,313 మందికి చేరింది. అదే సమయంలో 2024 సంవత్సరంలో 8 కోట్ల 82 లక్షల 39 వేల 675 మంది రోగులు.. దేశంలోనీ వివిధ రాష్ట్రాల నుంచి వైద్య సేవల కోసం తెలంగాణ కు వచ్చారు. ఇప్పటికే మెడికల్ టూరిజంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉండగా.. మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణతో మెడికల్ టూరిజంలో తెలంగాణ ను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.