Allu Arjun: భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అతి పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్ ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ 2025’ (Waves 2025) ముంబైలో గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మే 1 నుంచి 4 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఒక్క ఇండియన్ సినిమాల గురించి మాత్రమే కాకుండా.. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోని పలు విభాగాలకు సంబంధించిన విషయాలపై చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు వేవ్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులైన ప్రముఖ సెలబ్రిటీలెందరో ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సలహాలను, సూచనలను అందించనున్నారు. ఇక గురువారం జరిగిన సెషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి తనకు స్ఫూర్తి ఎవరో చెప్పిన వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
Also Read- Jailer 2: ఈ ఫ్రేమ్ ఎంత బాగుంది.. సినిమాలో ఇలా కనిపిస్తే బాక్సాఫీస్ బద్దలే!
మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి వారు తనకు స్ఫూర్తి అని అక్షయ్ కుమార్ అడిగిన ప్రశ్నకు చిరంజీవి (Chiranjeevi) సమాధానమిచ్చారు. అనంతరం జరిగిన కొన్ని సెషన్స్‌లో రజినీకాంత్, మోహన్ లాల్, రాజమౌళి వంటి వారంతా హాజరై, తమ సినిమా ఇండస్ట్రీల గురించి మాట్లాడారు. ‘టాలెంట్ బియాండ్ బోర్డర్స్’ అనే ప్యానెల్ చర్చలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. మరీ ముఖ్యంగా తన మామ మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మా అంకుల్ చిరంజీవి ప్రభావం నాపై చాలా ఉందని అల్లు అర్జున్ వేవ్స్ వేదికగా ప్రకటించడంతో.. కొన్నాళ్లుగా ఆ కుటుంబంలో అంతరాయాలకు బ్రేక్ పడినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ సొంత కుంపటి.. అదే మెగా ట్యాగ్ వదిలి అల్లు ఆర్మీని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇంతకాలం మెగా ఫ్యాన్స్ ట్యాగ్ వాడుకుని సడెన్‌గా అల్లు అర్జున్‌లో వచ్చిన మార్పుకు మెగా ఫ్యామిలీ కూడా హర్ట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అయినా సరే, తగ్గేదే లే అన్నట్లుగా అల్లు అర్జున్ వ్యవహరిస్తూ వస్తున్నారు. ‘పుష్ప’ (Pushpa) సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అల్లు అర్జున్‌ని పట్టుకోవడానికి వీలు లేనంతగా యాటిట్యూడ్ పెరిగిందనేలా వార్తలు వచ్చాయి. ఈ మధ్య సంధ్య థియేటర్ ఘటన, ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో మళ్లీ అల్లు అర్జున్‌లో మార్పు మొదలైందని, ఈసారి అందరినీ కలుపుకుంటూ వెళతాడనేలా టాక్ మొదలైంది. ఇప్పుడు వేవ్స్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడి, మళ్లీ అల్లు అర్జున్ మెగా గూటికి దగ్గరవుతున్నాడనేది నిజమే అనేలా అనిపించుకుంటున్నాడు.
Also Read- Hit 3 Review: బాబోయ్ ఇదేం ఊచకోత.. ‘హిట్ 3’ ఎలా ఉందంటే..
వేవ్స్ 2025 వేడుకలో అల్లు అర్జున్ ఏమన్నారంటే.. ‘‘ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నా ఫిట్‌నెస్ సీక్రెట్ మానసిక ప్రశాంతత. అవును అదే నా ఫిట్‌నెస్ సీక్రెట్. నా సినీ జర్నీలో ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లు అధిగమించాను. నాకు సినిమానే ప్రపంచం. అది తప్ప వేరే ఆలోచన లేదు, రాదు. ప్రేక్షకులు, అభిమానులు నాపై చూపించిన అభిమానం వల్లే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. నాకు మొదటి నుంచి మా అంకుల్ మెగాస్టార్ చిరంజీవే స్ఫూర్తి. ఆయన ప్రభావం నాపై ఎంతో ఉంది, ఉంటుంది’’ అని అల్లు అర్జున్ ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ వ్యాఖ్యల అనంతరం కొన్నాళ్లుగా జరుగుతున్న యుద్ధానికి తెరపడినట్టేనని మెగా ఫ్యాన్స్ (Mega Fans) భావిస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు