Deputy CM Pawan Kalyan: జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పంచాయితీరాజ్ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. శ్రామికుల కష్టం, నైపుణ్యాన్ని అర్దం చేసుకున్న వ్యక్తిగా, ఇకపై వారిని కూలీలు అని పిలవొద్దని, చెమటోడ్చి దేశాన్ని నిర్మాణం చేసే ఉపాధి శ్రామికులు అని పిలవాలని అన్నారు.
డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్ అనేది కాకుండా ప్రతీ వృత్తి గొప్పదే అని అన్నారు. నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి నాకు ఏ ఉద్యోగం చేయాలో అర్థం అయ్యేది కాదని అన్నారు. 20 ఏళ్ల వయసులో తాను గాజు బొమ్మలా పెరిగానని, బయటికెళ్లి పని చేద్దాం అంటే తన ఫ్యామిలీ పంపించే వారు కాదన్నారు. పనైనా ఇవ్వండి లేదా బయటికైనా వెళ్లనివ్వండి అని ఎలాగోలా బెంగళూరు నర్సరీలో పనికి వెళ్దాం అనుకున్నప్పుడు మావాళ్లు ఆపి ఇంటికి తీసుకొచ్చారన్నారు.
కండను కరిగించడమే నిజమైన శ్రమ అన్నారు. మీ అందరి సహకారంతోటే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. మీకు మంచి చేయడం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు. పంచాయితీ రాజ్ శాఖ తీసుకోవడం వెనుక ఓట్లు కానీ, ఎన్నికలు కానీ లేవని అన్నారు. దేవుడి దీవెనలతో, అందరి సహకారంతో ప్రభుత్వాన్ని నడిపించుకోగలుగుతున్నామని అన్నారు.