తెలంగాణ: Bharat Sumit: కాంగ్రెస్ యువ లీడర్లలో నూతనోత్సాహం నెల కొన్నది. రెండు రోజుల క్రితం భారత్ సమ్మిట్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు యవ నేతల్లో సంతోషాన్ని నింపాయి. కొత్త తరాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించడంతో పీసీసీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నది. పీసీసీ కార్యవర్గం, ప్రభుత్వం, పార్టీలోని నామినేటెడ్ పదవులను పార్టీ కోసం పనిచేసిన యువ నాయకత్వానికే ఇవ్వాలని ప్రపోజల్ ను తయారు చేశారు. జిల్లా కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల్లోనూ యువ లీడర్లకు ప్రయారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు.
అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు ఇవ్వాలని పీసీసీ కోరింది. ఆయా జిల్లాల నుంచి యువ నేతలను ఎంపిక చేసి లిస్టు పంపాలని పీసీసీ ఆదేశాలిచ్చింది. దీంతో యంగ్ లీడర్లంతా పుల్ జోష్ లో ఉన్నారు. ఈ దఫా పదవుల భర్తీలో తమకు ఛాన్స్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. పదవుల భర్తీలో యూత్ కే ప్రాధాన్యం ఇవ్వాలంటూ గతంలో గాంధీభవన్ లో జరిగిన పీఏసీ మీటింగ్ లోనూ తీర్మానం చేశారు. తాజాగా రాహుల్ గాంధీ కూడా క్లియర్ లైన్ ప్రకటించడంతో ఈ సారి సెలక్షన్ ఈజీగా ఉంటుందని పీసీసీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నది.
Also Read: HC on Group 1: గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హైకోర్ట్ కు టీజీపీఎస్సీ.. రేపే విచారణ!
సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల కు పెద్దపీట లభిస్తుంది. పదవుల భర్తీలో సిఫారసులు, ఇన్ ప్లూయెన్స్ వంటివి చెలమణి అవుతుంటాయి. అగ్రనేతలతో సత్సంబంధాలు వంటివి సీనియర్ నేతలకు కలిసి వస్తాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో మెజార్టీ సీనియర్ల ప్రభావంతోనే నియమించబడ్డాయి. తాజాగా ఎమ్మెల్సీలోనూ అదే జరిగింది. హైకమాండ్ రిలేషన్, లోకల్ నేతల సిఫారసులు వంటి వాటితో భర్తీ జరిగింది.
ఈ సారి నామినేటెడ్ పదవుల్లో అలాంటి పరిస్థితులు జరగకుండా జాగ్రత్త పడాలని ఇటు పార్టీ, ప్రభుత్వం భావిస్తుంది. స్వయంగా రాహుల్ గాంధీ ఆదేశించడంతో యూత్ కు ప్రాధాన్యం ఇవ్వడమనేది అనివార్యమైనది. రాహుల్ గాంధీ ప్రకటనలో పలువురు యువ నేతలు గాంధీభవన్ లోనూ సంబురాలు చేసుకున్నారు. పెండింగ్ లోని పదవులను వేగంగా భర్తీ చేయాలని పార్టీ, ప్రభుత్వాన్ని ఆయా లీడర్లు కోరారు.
పార్టీలో యువ లీడర్లను ప్రోత్సహించడం వలన ఎక్కువ కాలం యాక్టివ్ గా ఉండవచ్చనేది రాహుల్ గాంధీ ఉద్దేశం. ఇదే విషయాన్ని గతంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా సూచించారు. స్వయంగా గాంధీభవన్ కు వచ్చి నేతలందరికీ ఈ విషయాన్ని వివరించారు. 25 ఏళ్ల పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పదవులు భర్తీచేయాల్సి ఉంటుందని నొక్కి చెప్పారు. దీనికి సీనియర్లు అంతా సహకరించాల్సిందేనని సూచించారు.
Also Read: MLA Veerlapally Shankar: గులాబీల సభ కాదది.. గులాముల సభ.. కాంగ్రెస్ నేత ఫైర్!
దీంతో సీనియర్లు కూడా ఈ మీటింగ్ లో ఓకె చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో ఇది ఎంత వరకు సాధ్యమనేది అంతు చిక్కని ప్రశ్న. ఇప్పటికే తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని జీవన్ రెడ్డి అసంతృప్తితోనే ఉన్నారు. ఇక జగ్గారెడ్డి, జానారెడ్డి, మధుయాష్కీ గౌడ్, సునీతరావు, ఇందిరా శోభన్, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, తదితర సీనియర్లు కూడా తమకు ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవులు ఇస్తే బాగుంటుందని వాళ్ల అనుచరుల వద్ద ప్రస్తావిస్తున్నారు. పార్టీలో స్వేచ్ఛ ఎక్కువగా ఉండటంతో సీనియర్లంతా సొంత పార్టీని బహిరంగానే విమర్శించే సంస్కృతి కాంగ్రెస్ లో ఉన్నది. దీంతో నామినేటెడ్ లో యువ లీడర్లకు ఇస్తే సీనియర్లు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనేది ఇప్పుడు కాంగ్రెస్ లో ఉత్కంఠగా మారింది.