Mahesh Kumar on KCR: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ సీఎం కేసీఆర్ పై.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Meeting) అట్టర్ ప్లాప్ అంటూ మండిపడ్డారు. తెలంగాణ ఫస్ట్ అండ్ చివరి విలన్ కేసీఆర్ అంటూ విరుచుకుపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్దమని సవాలు విసిరారు. ‘టైం.. వేదిక మీరే డిసైడ్ చేయండి చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తా? ఫాం హౌస్ దాటి వచ్చే దమ్ముందా కేసీఆర్?’ అంటూ ఛాలెంజ్ చేశారు.
మూల్యం తప్పదు
ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో జనాల కంటే విస్కీలే ఎక్కువగా కనిపించాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. అసలు సభలో మహిళలే కనిపించలేదని అన్నారు. కేసిఆర్ ప్రసంగంలో పస లేదన్న టీపీసీసీ చీఫ్.. ఇక ఆయన శకం ముగిసిందని అభిప్రాయపడ్డారు. దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని.. నకిలీ గాంధీలు అనడం కేసీఆర్ దుస్సాహసానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే
రజతోత్సవ సభలో బీజేపీపై కేసీఆర్ పెద్దగా విమర్శలు చేయకపోవడాన్ని కూడా టీపీసీసీ చీఫ్ ప్రస్తావించారు. బీజేపీ – బీఆర్ ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనడానికి ఇది నిదర్శనమని అన్నారు. సుదీర్ఘ ప్రసంగంలో బీజేపీపై కేసీఆర్ రెండే నిమిషాలు మాట్లాడారని అన్నారు. బీజేపీపై కేసీఆర్ విమర్శలు నెమలి పించంతో కొట్టినట్లు ఉన్నాయని తెలిపారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ చట్టంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. బీజేపీ – బీఆర్ఎస్ కుట్ర పన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఫ్యామిలీలో మూడు ముక్కలాట
కాంగ్రెస్ పెట్టిన బిక్షతోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దొంగ పాస్ బుక్ లు చేసుకునే మీ కుటుంబం.. గాంధీ కుటుంబం పెట్టిన రాజకీయ బిక్షతో కోట్లకు పడగలెత్తిందని అన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. పదేళ్లలో మీరు 60 వేల ఉద్యోగాలు ఇస్తే.. మేము ఏడాదిలో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని టీపీసీసీ చీఫ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి కేసీఆర్ కి గుండెల్లో గుబులు మొదలైందని పేర్కొన్నారు. కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao), కవిత (Kalvakuntla Kavitha) ఆడుతున్న మూడు ముక్క లాటతో కేసీఆర్ కి మతి భ్రమించిందని విమర్శించారు. కుటుంబ కొట్లాట వేగలేక రజతోత్సవ సభ పేరిట కేసీఆర్ హంగామా చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు.
Also Read: Pakistani Women In AP: విచిత్రమైన ఫ్యామిలీ.. అన్న ఇండియన్.. చెల్లి పాకిస్థానీ.. పెద్ద కథే ఇది!
ప్రజలు క్షమించరు
రజతోత్సవ సభ వేదికపై తండ్రి కొడుకులైన కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) ఫ్లెక్సీ మాత్రమే ఉండటం చూసి అల్లుడు హరీష్ రావు, కూతురు కవిత మనసుకు గాయమైందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కేసీఆర్ ను క్షమించరని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన కేసిఆర్ కుటుంబం దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఆరోపించారు. దేశ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం కేసిఆర్ దేనని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పోతే దరిద్రం పోయిందని ప్రజలు ఆనందంగా ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.