Ponnam Prabhakar: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్.. మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో గల్ఫ్ చిక్కుకుపోయిన రాష్ట్ర వ్యక్తిని సొంత డబ్బులతో హైదరాబాద్ తీసుకొస్తున్నారు. బాధిత వ్యక్తి తన అనారోగ్యం గురించి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తనను స్వదేశం వచ్చేందుకు సాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కు సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. బాధితుడి కోరికను మన్నించిన మంత్రి.. హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఏం జరిగిందంటే
హుస్నాబాద్ కు చెందిన చొప్పరి లింగయ్య (Choppari Lingaiah) .. కొద్ది కాలం క్రితం దుబాయి (Dubai) వెళ్లారు. కుటుంబ పోషణ కోసం అక్కడ తీవ్రంగా కష్టపడేవారు. రెయింబవళ్లు శ్రమించి.. కుటుంబానికి డబ్బులు పంపేవారు. ఈ క్రమంలో లింగయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దుబాయిలో కూలి నాలీ చేసుకునే లింగయ్యకు తిరిగి స్వదేశానికి రావడం తలకు మించిన భారంగా మారింది.
సీఎంకు రిక్వెస్ట్
గత వారం తన దుస్థితిని వివరిస్తూ లింగయ్య సెల్ఫీ వీడియో (Selfy Video)ను రిలీజ్ చేశారు. తన అనారోగ్యం ఏమాత్రం బాగా లేదని ఊరికి వచ్చేందుకు సరిపడ డబ్బు కూడా లేదంటూ వాపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి పొన్నం ప్రభాకర్.. తాను ఇండియాకు వచ్చేందుకు సహకరించాలని వేడుకొన్నారు. అటు బాధితుడు ఫ్యామిలీ సైతం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
మంత్రి చొరవ
లింగయ్య పరిస్థితి చూసి చలించిపోయిన మంత్రి పొన్నం ప్రభాకర్.. తిరిగి అతడ్ని రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ B.M. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి లను సమన్వయం చేశారు. దీంతో వారు లింగయ్య వద్దకు వెళ్లి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. పరామర్శించి దైర్యం చెప్పారు. తిరిగి ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
Also Read: Visakhapatnam Crime: విశాఖలో జంట హత్యలు.. రక్తపు మడుగులో శవాలు.. ఎవరు చంపారు?
లింగయ్య కృతజ్ఞతలు
తన అనారోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు బాధితుడు లింగయ్య కృతజ్ఞతలు తెలిపారు. అటు లింగయ్య ఫ్యామిలీ సైతం మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తోంది. కష్టకాలంలో అండగా నిలిచిన ప్రభుత్వాన్ని తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామని పేర్కొంటున్నారు.