ACB on Transport department: రవాణాశాఖ అధికారులపై ఏసీబీ దృష్టిసారించింది. ఎక్కువ అవినీతి ఆరోపణలు వస్తుండటంతో ఎవరెవరూ ఉన్నారు. ఎవరి పనితీరు ఎలా ఉంది ఏం చేస్తున్నారనే వివరాలను ఇప్పటికే కొంతమంది ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆదాయానికి మించి ఆస్తున్నవారిపై ఒక్కొక్కరిపై దాడులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. వరుసదాడులతో రవాణాశాఖ అధికారులు ఉలికిపడుతున్నారు. ఏసీబీ దగ్గర ఎవరి పేర్లు ఉన్నాయనే దానిపైనా కొంతమంది అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రధాన శాఖల్లో ఒకటి స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ(ఎస్టీఏ). ఇందులో వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్ తనిఖీ, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన ఎక్స్ టెన్షన్ జారీ ప్రధానమైనవి. అయితే కిందిస్థాయి అధికారుల నుంచి చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు కొంతమంది బాధితులు ఏకంగా ఏసీబీ అధికారులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. దీంతో వారు రవాణాశాఖపై దృష్టిసారించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఆదాయానికి మించి ఎవరెవరూ ఆస్తులు కూడబెట్టారనే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కువగా ఆర్టీఓ లేదా డీటీసీ, లేదా ఏఓ లేదా జేటీసీ ఇలా వివిధ హోదాలో పనిచేస్తున్న పలువురిపై నిఘా పెట్టినట్లు సమాచారం. ఆఫీసులనే అడ్డగా చేసుకొని కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ ఆదాయానికి మించి ఆస్తులు కూడగడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఆఫీసర్లు ప్రైవేటు ఏజెంట్లను నియమించుకొని మరీ వసూల్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతుంది.
Also Read: Congress on KCR: గులాబీ దండుకు వరంగల్ ఫీవర్.. ఒకటే ప్రశ్నలు.. ఆన్సర్లు కష్టమే!
ఈ ఏడాది ఫిబ్రవరి లో హనుమకొండ ట్రాన్స్‌పోర్ట్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ పై ఫిర్యాదులు రావడంతో ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, వరంగల్‌తో పాటు 8 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ డీటీసీ శ్రీనివాస్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో ఆయన ఇంట్లో ఏసీబీ రైడ్ నిర్వహించి దాదాపు 10 కోట్ల రూపాయల ఆస్తుల ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది.
తాజాగా మహబూబాబాద్ జిల్లా మాజీ రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులు రావడంతో మహబూబాబాద్, హైదరాబాద్ , కరీంనగర్ లోని ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టారు. దాదాపు 10 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల ఆయన ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయ్యారు. ఆయనపై మళ్లీ ఫిర్యాదులు రావడంతో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆస్తులను గుర్తించింది. ఈ దాడులతో రవాణాశాఖలో పనిచేస్తున్న అధికారులు ఉలికిపడుతున్నారు. ఎప్పుడు ఏ అధికారి ఇంటిపై ఏసీబీ సోదాలు చేస్తుందని ఆందోళకు గురవుతున్నారు.
ఆరా తీస్తున్న అధికారులు
ఏసీబీ వరుస దాడులతో రవాణాశాఖ అధికారులు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఏసీబీ అధికారులకు తమపైనా ఎవరైనా ఫిర్యాదు చేస్తున్నారా? ఎవరిపై ఎవరు చేస్తున్నారనే వివరాలను పలువురు అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. కొంతమంది డిపార్టు మెంట్లో తమకు గిట్టనివారు ఎవరైనా ఫిర్యాదు చేయిస్తున్నారా? అనే వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ లోని ఎస్టీఏ కార్యాలయంపైనా ప్రధాన ఫోకస్ పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయం కూడా అక్కడే ఉండటంతో కొంతమంది ఏజెంట్లు కార్యాలయానికి పనిమిత్తం వెళ్లిన ప్రతి ఒక్కరిని లైసెన్స్ ఇప్పిస్తామని, వాహనం రిజిస్ట్రేషన్ చేయిస్తామని అడుగుతున్నారు. ఈ తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
దీంతో ఆ ప్రైవేటు ఏజెంట్లను ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఏ అధికారి అండ ఉంది తదితర వివరాలను సైతం సేకరించే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం. ఏది ఏకమైనప్పటికీ ఏసీబీ అధికారుల దూకుడుతో రవాణాశాఖ అధికారులకు కంటిమీద కునుకులేకుండాపోతోంది.
Also Read: Kaleshwaram Project: కాళేశ్వరంపై 400పేజీల రిపోర్ట్.. కేసీఆర్, హరీశ్, ఈటలకు నోటీసులిచ్చే ఛాన్స్!