Tirumala Updates: తిరుమలలో ఇకపై భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం వంటి చేష్టలు, ఇష్టారీతిన దోపిడీ ఇక చెల్లదని దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వి. హర్షవర్ధన్ రాజు వార్నింగ్ ఇచ్చారు. తిరుమల ఆస్థాన మండలంలో 400 టాక్సీ డ్రైవర్లకు, 50 ఓనర్లకు భక్తుల పట్ల అనుసరించాల్సిన విధానాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, ఓనర్లతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు.
సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ.. తిరుమల భద్రతకు సంబంధించి డ్రైవర్లది చాలా కీలకమైన పాత్ర అన్నారు. తిరుమలలో భద్రత, క్రమశిక్షణ, శాంతి భద్రతలు చాలా ముఖ్యమైనవని, వాహన డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. తిరుమల కు వచ్చే భక్తులు పట్ల ప్రతి ఒక్క టాక్సీ డ్రైవర్ బాధ్యతగా, మర్యాదగా ప్రవర్తిస్తే మీ పేరు నలుదిశలా వ్యాపిస్తుందన్నారు. అలా కాకుండా సంపాదనే ధేయ్యంగా భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే నలుదిశలా మీకు చెడ్డ పేరు వస్తుందన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. కాబట్టి తిరుమలకు వస్తున్న భక్తులకు పట్ల గౌరవం వ్యవహరిస్తూ.. వారికి తెలియని విషయాలను అడిగిన వెంటనే సమాచారం ఇచ్చే విధంగా ప్రతి ఒక్క డ్రైవర్ వ్యవహరించాలన్నారు.
నిషేధిత వస్తువులు తిరుమలకు తీసుకురాకూడదని.. నిషేధత వస్తువులు ఎవరు తీసుకు వచ్చినా మీ భాద్యతగా వ్యవహరించి వెంటనే పోలీసులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. డ్రైవర్ల మధ్య ఎలాంటి వివాదాలకు తావులేకుండా, డ్రైవర్లతో డ్రైవర్లు గొడవ పడకుండా ఉండాలన్నారు. పాసింజర్లు కోసం రోడ్డు మీద పడి గలాటలు చేసి.. భక్తులకు ఇబ్బంది కలిగిస్తే సహించేదిలేన్నారు. మేము చెప్పిన విధంగా కాకుండా ఏ ఒక్క డ్రైవర్ అయిన పోలీసు నిబంధనలు ఉల్లంఘించినా అలాంటి వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.
వేసవికాలంలో ప్రమాదాల రీత్యా వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా పొంది ఉండాలని, వెహికల్ కండిషన్లో ఉండాలన్నారు. తమ వాహనాలలో భక్తులు ఏమైనా మర్చిపోతే బాధ్యతతో భక్తులకు చేర్చడం లేదా పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిన భాద్యత ప్రతి ఒక్క డ్రైవర్ పైన ఉందన్నారు. నేరస్తులుకాని, ఎవరైనా దొంగలు కాని మీ వాహనాలు ఎక్కినప్పుడు మీ కంట పడితే భద్రత దృష్ట్యా వెంటనే పోలీసు సిబ్బందికి కాని డయల్ 112 నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. అంతే కాకుండా తిరుమలలో ఎవరైన భక్తులు మిస్సింగ్ అయినట్లు మీ సమాచారం వస్తే వేంటనే మీ వాట్సాప్ గ్రూపులో పోలీసు వారికి షేర్ చేయాలన్నారు. మీ డ్రైవర్లు గ్రూపులో పోలీసు వారు కూడా ఉంటారని తెలిపారు.
తిరుమలలో భద్రత, క్రమశిక్షణ, శాంతిభద్రత మాత్రమే ముఖ్యమైన అంశాలుగా ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భద్రత అనేది.. ప్రతి ఒక్కరి చేతులలో ఉంటుందన్నారు. మేము కనపడే పోలీసులమైతే.. మీరందరూ కనబడని పోలీసులని ఆయన తెలిపారు. ఒక్కొక్క సందర్భంలో మీరు ఇచ్చే చిన్న సమాచారమే.. ఒక్కసారి పెద్ద పెద్ద ఉపద్రవం నుండి కాపాడవచ్చనే సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. తిరుమలలో ఉన్న ప్రతి ఒక్కరూ.. ఒక సైనికుడు లాగా పని చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.రామకృష్ణ అదనపు ఎస్పీ తిరుమల, విజయ శేఖర్ డిఎస్పి తిరుమల, N.T.V. రామ్ కుమార్ వి.జి.వో, సురేంద్ర వీ. జి. వో, సదాలక్షి తిరుమల, ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం.బి.ఐ తిరుమల, సిఐలు, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు