Nadendla Manohar: పహల్గాం ఉగ్రదాడులను ఖండిస్తూ దాడిలో అమాయకంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో విజయవాడ పాత బస్టాండ్ వద్ద ఏలూరు రోడ్డులో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు సామినేని ఉదయభాను, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఉగ్రవాదులు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాలకు మేమంతా అండగా నిలుస్తాం అని మంత్రి అన్నారు.
జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా కావలిలో ఉగ్రదాడిలో మరణించిన జనసేన కార్యకర్త మధుసూదనరావు భౌతికకాయాన్ని సందర్శించగా, అతని భార్య చెబుతున్న తీరును విన్నప్పుడే కన్నీరు ఆగలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల సమయంలో మనం ఐక్యంగా ఉండాలి. భారతీయులుగా బాధితులకు భరోసా కలిగించాలి.
ఈ దుశ్చర్యలకు కేంద్ర ప్రభుత్వం తగిన బుద్ధి చెబుతుందని, ఇప్పుడు రాజకీయాలు, కులాలు, మతాలు చూసే సమయం కాదు. మనం భారతీయులం ఒక్కటిగా నిలబడాలి అని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు మౌన దీక్షలు మానవహారాలు నిర్వహించ్చారు. ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడేది లేదని, నిఘా వర్గాల సమాచారం మేరకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/