AP Govt on 99 Paise Per Acre: మీ జేబులో రూపాయి ఉందా? అయితే రూపాయికి ఏమి వస్తుంది? బయట మార్కెట్ కు వెళ్ళినా రూపాయికి వచ్చే వస్తువు ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఏపీలో మాత్రం రూపాయికి ఎంచక్కా భూమి కొనుగోలు చేయవచ్చని సోషల్ మీడియా ట్రెండీగా మారింది. ఇంతకు రూపాయికి ఏపీలో ఎకరా స్థలం వస్తుందన్న విషయంలో వాస్తవమెంత? ఏంటి ఈ రూపాయి గోల తెలుసుకుందాం.
ఏపీలో ఇప్పుడు ఎవరి నోట విన్నా, రూపాయి మాటే. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఇదే ట్రెండీగా మారింది. దీని వెనుక అసలు కథ ఏమిటంటే.. కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఏపీలో పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. సీఎం చంద్రబాబు విజన్ కు తగినట్లుగా పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
పారిశ్రామికంగా ప్రత్యేక గుర్తింపు పొందిన విశాఖపట్టణానికి పలు ప్రముఖ సంస్థలు తరలివచ్చే పరిస్థితి. విశాఖలో కంపెనీల స్థాపనకు ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు వేసి లులు కంపెనీ, ఇలా ఎన్నో కంపెనీలకు రెడ్ కార్పెట్ వేసింది. దీనితో ఏపీలో నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వ ఉద్దేశం. అంతేకాదు యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, అసలే ఏపీలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందన్నది ప్రభుత్వ అభిప్రాయం. అందుకే కూటమి అధికారంలోకి రాగానే, ఒకదాని వెనుక ఒకటి పెద్ద సంస్థలు ఏపీ వైపు దారి పట్టాయి.
ఈ దశలోనే విశాఖలో ఉర్సా కంపెనీకి ఎకరా రూ.0.99 పైసలకు మాత్రమే భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఇందులో ఏమేరకు వాస్తవం ఉందో కానీ, రూపాయికి మార్కెట్ లో ఏ వస్తువు రాని పరిస్థితిలో విశాఖలో నేరుగా ఎకరం భూమి వస్తుందని వైసీపీ సోషల్ మీడియా జోరుగా ప్రచారం సాగించింది. మీ చేతిలో రూపాయి ఉంటే చాలు విశాఖలో స్థలం కొనండి అంటూ సోషల్ మీడియా కోడై కూసింది. రూపాయి అనేది ఇప్పుడు ఏపీలో ట్రెండ్ సెట్ చేసే స్థాయికి వెళ్లింది.
అయితే టిడిపికి చెందిన కొందరు వైసీపీ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఏపీలో రూపాయికి 12 వేల జాబ్స్ వస్తాయని కొందరు రివర్స్ అటాక్ సాగించారు. ఇలా రూపాయి సోషల్ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతోంది. ముందు 99 పైసలకే ఒప్పందం సాగినట్లు ప్రచారం అందుకోగా ప్రజలు సైతం నివ్వెరపోయారు.
ఎంత మాత్రం ఉపాధి అవకాశాలు వస్తాయని, ఇలా అప్పనంగా ప్రభుత్వ భూమి కట్టబెట్టడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల మాజీ సీఎం జగన్ సైతం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుందని అనుకుంటే, ఇలా రూపాయికి అప్పనంగా భూములు ఇస్తుందా అనే స్థాయిలో ర్యాగింగ్ చేశారనే చెప్పవచ్చు. దీనిపై ఏపీ ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది.
Also Read: Chiranjeevi: చంద్రబాబు ముందుచూపు వల్లే హైదరాబాద్ విశ్వ నగరమైంది.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
ఏపీ డాటా సెంటర్ పాలసీ ప్రకారం SIPC సూచనల మేరకు ఉర్సా కంపెనీకి ఎకరం రూ.50 లక్షల చొప్పున 56.6 ఎకరాలు, ఎకరం రూ.కోటి చొప్పున 3.5 ఎకరాలు కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించటం జరిగిందని ఏపీ ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చారు. కొంతమంది పదే పదే పనికట్టుకుని ఎకరా 99 పైసలకే ఇచ్చినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని ఈ వివరణ సారాంశం. ప్రభుత్వ వివరణతోనైనా రూపాయికి ఏమి వస్తుందనే ట్రెండీ టాపిక్ కు తెర పడుతుందేమో వేచిచూడాలి.