Duvvada Srinivas: నన్ను బలి చేశారు. రాజకీయ క్రీడలో చివరకు నన్ను ఇలా వదిలేశారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవల సస్పెండ్ కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. తనను పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై దువ్వాడ సంచలన వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఇటీవల సస్పెండ్ చేస్తున్నట్లు వైసిపి కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పార్టీ అధ్యక్షులు జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదలైంది. అలాగే పార్టీ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నందుకు దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. తన సస్పెన్షన్ పై దువ్వాడ శ్రీనివాస్ తాజాగా స్పందించారు.
దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేసిన వీడియో ఆధారంగా.. తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా తనకు ఈ స్థాయి హోదా కల్పించిన మాజీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, ప్రతిపక్షాలపై గట్టిగా మాట్లాడి తన వానిని వినిపించినట్లు దువ్వాడ చెప్పుకొచ్చారు.
తనను అకారణంగా వ్యక్తిగత కారణాల రీత్యా సస్పెన్షన్ చేసినట్లు దువ్వాడ అభిప్రాయపడ్డారు. అయితే పార్టీ అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని, రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో అడుగులు వేసి జగన్ తో సైతం రాజకీయ అడుగులు వేయడం తనకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఎప్పటికైనా జగన్ కు తన మదిలో సుస్థిర స్థానం ఉంటుందని దువ్వాడ అభిప్రాయపడ్డారు. తనను రాజకీయ క్రీడలో బలి చేసినట్లు ప్రకటించిన దువ్వాడ శ్రీనివాస్, 25 సంవత్సరాలుగా రాజకీయ రంగంలో రాణిస్తూ ఎక్కడ లంచాలు తీసుకోలేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదంటూ చెప్పుకొచ్చారు. సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామాన్ని ప్రకటించడమేనని, గురజాడ చెప్పినట్లుగా విజయం కోసం విసుగును వీడి కష్టపడి పని చేయాలి అనే నినాదంతో ఇక మున్ముందు రాజకీయాల్లో రాణించనున్నట్లు తెలిపారు.
Also Read: Pawan Kalyan: పవన్ వార్నింగ్.. అధికారులు హడల్..
తటస్థుడిగా మరింత రెట్టింపు ఉత్సాహంతో తాను పనిచేస్తానని, త్వరలోనే గ్రామ గ్రామాన పర్యటించనున్నట్లు దువ్వాడ తెలిపారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటానని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందన్నారు. టెక్కలి ప్రజలకు తన ఊపిరి ఉన్నంతవరకు సేవ చేస్తానని, తనకు వచ్చిన ప్రతి హోదా వెనక టెక్కలి ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు. మొత్తం మీద మాజీ సీఎం జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన అనంతరం దువ్వాడ శ్రీనివాస్ స్పందించి, రాజకీయ క్రీడలో బలి చేశారని, అలాగే త్వరలో గ్రామ గ్రామాన పర్యటిస్తున్నట్లు ప్రకటించడం విశేషం.