Moist Killed: ఉమ్మడి వరంగల్ జిల్లా భారీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఆపరేషన్ కగార్ లో భాగంగా చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని ములుగు కర్రెగుట్టల అడవుల్లో భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్ లో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ములుగు చుట్టు పక్కల గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
చత్తీస్ గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టుల ఉనికి అధికంగా ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఇందులో భాగంగా ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి. దీనికి ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) అనే పేరును సైతం పెట్టారు. ఈ క్రమంలో రెండ్రోజులుగా ములుగు కర్రెగుట్టల (Karreguttalu) అడవుల్లో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మూడో రోజైన ఇవాళ కూడా అడవిని జల్లెడపడుతున్న క్రమంలో ఒక్కసారిగా మావోలు కాల్పులతో రెచ్చిపోయారు. ఎదురుదాడికి దిగిన బలగాలు.. ఐదుగురిని మట్టుబెట్టినట్లు సమాచారం.
ప్రస్తుతం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య బీకర కాల్పులు జరుగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సమీపంలోని భీమారంపాడు గ్రామస్తులకు బలగాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఎవరూ బయటకు రావద్దని సూచించారు. మరోవైపు అడవీ ప్రాంతాన్ని హెలికాప్టర్ల ద్వారా బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రగుట్ట అడవులను భద్రత బలగాలు పూర్తిగా చుట్టుముట్టాయని సమాచారం. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా.. కర్రగుట్టలో ఉన్నట్లు తెలుస్తోంది. 2500 మంది మావోయిస్టులు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కాసేపట్లో వరంగల్ కమిషనరేట్ లో మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది. మావోలు భారీగా లొంగిపోయే ఛాన్స్ ఉందంటున్నారు.
Also Read: High Security In Tirumala: తిరుమలలో హైఅలర్ట్.. వాహనాల ముమ్మర తనిఖీలు.. ఎందుకంటే?
ఇదిలా ఉంటే తాజాగా మల్టీ జోన్ 1 ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 250 మంది మావోలు సరెండర్ అయినట్లు చెప్పారు. ఈ రోజు 14 మంది లొంగిపోయినట్లు స్పష్టం చేశారు. ఇందులో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు కాగా 4గురు కమిటీ సభ్యులు ఉన్నారు. వారికి తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి 25వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు వచ్చి లొంగిపోయినా.. పోలీస్ శాఖ సహకారం ఉంటుందని ఐజీ స్పష్టం చేశారు. ఉద్యమంలో పనిచేస్తున్న సభ్యులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఐజీ హామీ ఇచ్చారు.