Suryakantham: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరి పేర్లు అలా చిరస్థాయిగా నిలిచిపోతాయి. అందులో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి.. ఇలా అలనాటి నటీనటులు పేర్లు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం వారి పేర్లు ఏదో ఒక చోట వినబడుతూనే ఉంటాయి. అయితే వీరితో పాటు మరో పేరు కూడా వినిపిస్తుంది. ఆవిడ హీరోయిన్ కాదు, కానీ అందరి ఇళ్లలో ఆ పేరు వినబడుతుంది. అత్తాకోడళ్ల మధ్య కోట్లాట జరుగుతున్నా, ఎవరైనా గయ్యాళిగా కనిపించినా వెంటనే గుర్తొచ్చే పేరు వన్ అండ్ ఓన్లీ సూర్యకాంతం. ఇంకా చెప్పాలంటే, తల్లిదండ్రులు తమ పిల్లలకి నటీనటుల పేర్లు పెట్టడం సహజమే. కానీ కొన్ని ఏళ్లుగా ఏ ఒక్కరూ తమ పిల్లలకు ఈ పేరు పెట్టే సాహసం చేయలేదంటే, ఆమె ఎంతగా తన పాత్రలకు జీవం పోశారో అర్థం చేసుకోవచ్చు.
Also Read- Singer Sunitha: సింగర్ సునీత మనసు దోచుకున్న హీరో ఎవరో తెలుసా? తెలిస్తే షాకవుతారు
గయ్యాళి అత్తగా చేయాలన్నా, రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టాలన్నా, భర్తపై నోరేసుకుని అరవాలన్నా.. అప్పట్లో దర్శకనిర్మాతలకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ సూర్యకాంతం. తను తప్ప ఆ పాత్రలు మరొకరు చేయలేరు అనేంతగా ప్రేక్షకులలో ఆమె ముద్ర వేయించుకున్నారు. నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని, ఏ పాత్ర చేసినా, ఆ పాత్రకు ప్రాణం పోయడం కాదు, నిజంగా ఆ పాత్ర అక్కడ కనిపించేలా నటించి సూర్యకాంతం ఎనలేని కీర్తిని అందుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఆమె రీల్ లైఫ్‌లో చేసిన పాత్రని చూసి, రియల్ లైఫ్‌లోనూ ఆమె అలాగే ఉంటుందని భయపడే వారెందరో. అలాంటి సంఘటనే ఒకటి సూర్యకాంతం ఇంటిలో జరిగింది. అదేంటంటే..
సూర్యకాంతం అంటే భయానికి నిర్వచనంగా అప్పట్లో పేరు పొందారు. ఎవరైనా సినీ నటి చుట్టు పక్కల ఏదైనా ఫంక్షన్‌కు వస్తుంటే అప్పట్లో జనాలు తండోపతండాలుగా వచ్చేవారట. కానీ సూర్యకాంతం ఫంక్షన్‌కు అటెంట్ అయితే, కనీసం దగ్గరకు రావడానికి కూడా భయపడిపోయేవారట. ఆటోగ్రాఫ్ కాదు కదా.. ఆమె పక్కకు వెళ్లడానికి కూడా సాహసం చేసేవారు కాదని చెబుతుంటారు. అలాంటి సూర్యకాంతం ఇంటిలో ఓసారి ఏం జరిగిందంటే..
Also Read- Bromance OTT: ట్విస్టులతో కూడిన లాఫింగ్ రైడర్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?
సూర్యకాంతం ఇంటిలో పనిచేసే పని మనిషి, తన ఇంటిలో ఏదో శుభకార్యం ఉండటంతో కొన్ని రోజులు సెలవు తీసుకుంటానని చెప్పిందట. నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే సూర్యకాంతంకు ఇంటిలో పని మనిషి లేకపోతే అసలు జరగదు. అందుకే, కాకినాడలో ఉన్న తన స్నేహితురాలికి వెంటనే పని మనిషి కావాలని ఉత్తరం రాసిందట. సూర్యకాంతం కోరడంతో ఆ స్నేహితురాలు ఓ పని మనిషిని వెంటబెట్టుకుని మద్రాస్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చిందట. అయితే ఆ పని మనిషికి ఎవరింట్లో పని చేసేది ఆమె చెప్పలేదట. ఆ స్టేషన్‌లో మాటల మధ్యలో.. వెళ్లేది నటి సూర్యకాంతం ఇంటికి అని తెలుసుకున్న ఆ పని మనిషి వెంటనే తన లగేజ్ తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీసిందట. అంతే, అప్పట్లో సూర్యకాంతం అంటే ఆ మాత్రం ఉండేది మరి.
కానీ, సూర్యకాంతం మనసు మాత్రం వెన్న అని అంతా అంటుంటారు. ఎవరైనా ఇంటికి వెళితే, వాళ్లని భోజనం చేయనీయకుండా బయటికి పోనివ్వని గొప్ప మనస్సు ఆమెదని అంతా అంటుంటారు. అందుకే అంటుంటారు కవర్ పేజీ చూసి, బుక్‌ని అంచనా వేయకూడదని. అలాగే సూర్యకాంతం కూడా. పైకి కనిపించే గయ్యాళి కాదు ఆమె. ఎంతో సున్నితమైన మనసు గలవారిని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు