AP Heatwave: ఏపీలో సమ్మర్ హాలిడేస్ వచ్చేశాయి. సమ్మర్ హాలిడేస్ ఎంత స్పీడ్ గా వచ్చాయో అంతే స్పీడ్ గా ఎండలు సైతం అధికమయ్యే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రానున్న రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.
ఏపీలో క్రమక్రమంగా ఎండ తీవ్రత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం నంద్యాల జిల్లా గోనవరంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వైయస్సార్ జిల్లాలో గల 28, నంద్యాల 22, ప్రకాశం 17, పల్నాడు 14, కర్నూలు జిల్లాలోని 10 ప్రాంతాలలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా 135 ప్రాంతాలలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు నెలకొంది. గురువారం సైతం 39 మండలాలలో తీవ్రవడగాలులు, 29 మండలాల్లో వడగాలను వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని రానున్న రోజుల్లో మండే ఎండలు ప్రజలను భయపెట్టే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.
ఎండల సమయంలో అత్యవసరమైతే తప్ప చిన్నారులు, వృద్ధులు బయటకు రావద్దని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా త్రాగునీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అసలే సమ్మర్ సీజన్ కావడంతో ప్రయాణాలు సాగించేవారు సైతం ఉదయం, సాయంత్రం వేళ తమ టూర్ ప్లాన్ చేసుకోవాలని, అప్పుడే ప్రశాంత ప్రయాణం సాగుతుందని రవాణా శాఖ అధికారులు సైతం తెలుపుతున్నారు.
Also Read: Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్రదాడి.. ప్రభాస్ సినిమాపై తీవ్ర ఒత్తిడి!
గతం కంటే భిన్నంగా సమ్మర్ కంటే ముందుగానే ఏపీలో ఎండ తాకిడి ఎక్కువగా ఉండగా, రానున్న రోజుల్లో ఎండ ప్రభావం అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏపీ ప్రజలు రానున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని ప్రభుత్వం సైతం సూచిస్తోంది. వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఏదైనా అనారోగ్య సమస్య ఎదుర్కొంటే తప్పనిసరిగా స్థానిక వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలుపుతోంది. మొత్తం మీద రానున్న ఎండలను తట్టుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఏపీలో కనిపించడం విశేషం.