YCP on Manchu Vishnu: ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ (YSRCP) ఘోర ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 175 గాను 151 స్థానాలు గెలిచిన పార్టీ.. 2024కు వచ్చేసరికి కేవలం 11 సీట్లను మాత్రమే సాధించగలిగింది. దీంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వైసీపీని టార్గెట్ చేస్తూ ’11’ అంకెను వైరల్ గా మార్చారు. 11 అంకె చుట్టూ ఏ విషయం జరిగినా దానిని జగన్ కు ఆపాదించడం ప్రారంభించారు. ఈ ట్రాప్ లో పడిపోయిన వైసీపీ శ్రేణులు సైతం 11 అంకె కనిపిస్తే చాలు తెగ మండిపడిపోతున్నారు. ఈ క్రమంలో మంచు విష్ణు (Manchu Vishnu) సైతం ఈ ’11’ అంకె వివాదంలోకి వచ్చేశారు. ఆయనపై వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
మంచు విష్ణు ట్వీట్..
టాలీవుడ్ చెందిన ప్రముఖ నటుల్లో మంచు విష్ణు ఒకరు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ (Kannappa) షూటింగ్ తో విష్ణు బిజీ బిజీగా గడుపుతున్నారు. అడపా దడపా ఆ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ ఇస్తూ తన మూవీపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంచు ఆసక్తికర ట్వీట్ పోస్ట్ చేశారు. తన హృదయానికి బాగా హత్తుకున్న ఓ విషయాన్ని బుధవారం ఉదయం 11 గం.లకు వెల్లడించనున్నట్లు మంచు విష్ణు ట్వీట్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా కన్నప్ప గురించే విష్ణు అప్ డేట్స్ ఇస్తూ వస్తుండటంతో .. ఇది కూడా కన్నప్పకు సంబంధించిన విషయమే అయి ఉంటుందని అంతా భావిస్తున్నారు.
వైసీపీ శ్రేణులు ఫైర్..
గత కొద్దిరోజులుగా 11 అని నెంబర్ అంటేనే చిరాకు పడుతూ వస్తోన్న వైసీపీ శ్రేణులు తాజాగా మంచు విష్ణుని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం 11 గంటలకు ఓ కీలక విషయాన్ని చెబుతానంటూ మంచు విష్ణు ట్వీట్ పెట్టిన వెంటనే ఆయన్ను విమర్శిస్తూ నెట్టింట పోస్టులు వెలిశాయి. 11 తప్పా ఇంకో టైమ్ దొరకలేదా అంటూ నిలదీస్తున్నారు. సరిగ్గా 11 గం.లకు రిలీజ్ చేయాల్సిన పని ఏంటని మండిపడుతున్నారు. మా జగనన్నను ట్రోల్ చేసే ఉద్దేశ్యంతోనే విష్ణు ఇలా పోస్ట్ పెట్టాడని జగన్ ఫొటోతో ఉన్న ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించాడు. వాస్తవానికి సీఎం జగన్ కు మంచు విష్ణువు స్వయానా బంధువు అవుతారు. అయినప్పటికీ విష్ణును వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తుండటంపై రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ టీడీపీ కార్యకర్తలే జగన్ ఫొటో పెట్టుకొని ఇలా విమర్శలు చేస్తూ ఉండవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది.
పగులుతాది రా మీకు 😡
వేరే టైమ్ దొరకలేదారా మీకు?
కరెక్ట్ గా 11 గంటలకు రిలీజ్ చేయాల్సిన పని ఏంటి? మా జగనన్నను ట్రోల్ చేయాలనే ఉద్దేశం లేకపోతే తప్పా!!
ఇలాగే ఎగరండి మేమొచ్చాక చూపిస్తాం మేమేంటో 😡😡#BoycottKannappa https://t.co/laeccAfQ5E
— Ranganath Reddy (@RangannaYCP) April 22, 2025
జూన్ 27న విడుదల
ఇదిలా ఉంటే విష్ణు ప్రధాన పాత్రలో చేస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు (Mohan Babu), శరత్ కుమార్ (Sarath Kumar), మోహన్ లాల్ (Mohan Lal) తదితర దిగ్గజ నటులు చేస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.