Indiramma Housing scheme: పూర్తిగా ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇళ్లు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని, ఈ పథకంలో ఒక్క అనర్హునికి కూడా లబ్ధి చేకూర్చరాదని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ యం.డి వి.పి గౌతమ్ తెలిపారు. సిద్దిపేట ఐడిఓసిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ యం.డి వి.పి గౌతమ్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 5లక్షలతో ఇంటి నిర్మాణం ఏ విధంగా సాధ్యమన్న సందేహాన్ని తీర్చి లబ్దిదారుల్లో నమ్మకాన్ని కల్పించేలా జిల్లాలో అన్ని మండలాల్లోని గ్రామాలలో ఇందిరమ్మ మోడల్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కొరకు వచ్చిన దరఖాస్తులలో స్థలం ఉండి పూర్తిగా ఇళ్లు కట్టుకునె స్థోమత లేని నిరుపేదలను మాత్రమే గుర్తించాలని, ఆర్థిక సహకారం కోరుకునే వారికి మహిళా సమాఖ్యల ద్వారా రుణం ఇప్పించేలా అధికారులు చొరవ చూపించాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో పూర్తయ్యే ఇంటి నిర్మాణ పనులను పంచాయితి సెక్రటరి పోర్టల్ లో నమోదు చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదని, లబ్దిదారుడె తన స్మార్ట్ ఫోన్ లో ఇందిరమ్మ ఇండ్లు అనే ఆప్ ను డౌన్ లోడ్ చేసుకొని దానిలో ఎప్పటికప్పడు ఫోటోలను అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగిందని, వాటి ఆధారంగా బిల్లుల ఆలస్యం ఉండదని స్పష్టంచేశారు. అప్ లోడ్ చేసిన ఫోటోలను యంపిడిఓలు, ఏఈలు సూపర్ చెక్ చేయాలన్నారు.
Also Read: Waragal Gurukulam: గురుకుల ప్రవేశాల్లో నియమాల మాయం.. విద్యార్థులపై అన్యాయం ఎవరి బాధ్యత?
లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా, స్థానికంగా నివాసం ఉంటూ, ఇల్లు కట్టుకునే స్తోమత లేని బి.పి.ఎల్ కు చెందిన వారిని మాత్రమే ఎంపిక చేయాలని, ఇందిరమ్మ కమిటిలు గుర్తించిన వారిలో సైతం అధికారులు మరోసారి పరిశీలించాలని, క్షేత్రసాయిలో పర్యటిస్తూ, లబ్దిదారులు 5లక్షల్లో ఇళ్లు కట్టుకోవడంలో ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుంటూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
స్థలం ఉండి మరో చోట నివాసం ఉండే వారికి మరియు అర్హుడు కానీ ఏ ఒక్క లబ్దిదారునికి కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం అందకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. అసంపూర్తిగా, చివరిస్థాయిలోఉన్న రెండుపడకగదుల నిర్మాణ పనులపై మాట్లాడుతూ, వాటిని పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ లు, లేదా యజమానులు ముందుకు వచ్చినట్లయితే వారితో ప్రభుత్వం నిర్ణయించిన మేరకే నిర్మాణ పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు.
Also Read: Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల్లో చేనేత మజిలీ.. పోచంపల్లి పథకంపై ప్రపంచ దృష్టి!
నిర్మాణ పనులు పూర్తయిన దానిబట్టి బిల్లుల విడతల వారీగా చెల్లింపులు త్వరగా చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ, అధికారులకు గ్రామాల వారీగా ఇళ్ల నిర్మాణాల కొరకు వచ్చిన దరఖాస్తుల వారిగా లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిని క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, త్వరగా పూర్తిచేసేలా ప్రోత్సహించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్క అనర్హులు ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా నమోదు చేయించడం, ఆర్థికంగా వెనుకబడిన వారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలన్నారు.
ఇంటి నిర్మాణం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మాత్రమే ఉండేలా చూడాలని, పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండి విపి గౌతమ్ కుకునూరుపల్లి మండలంలోని మేదినిపూర్, సిద్దిపేట రూరల్ మండలంలోని వెంకటాపూర్, కోహెడ మండలంలోని పోరెడ్డిపల్లి గ్రామాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు, స్థానిక అధికారులతో కలిసి ప్రస్తుతం లబ్ధిదారులు ఉంటున్న ఇండ్లను పరిశీలించి లబ్ధిదారుల వివరాలను కనుక్కున్నారు.
కార్యక్రమంలో చివరగా రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ యం.డి వి.పి గౌతమ్ ను చేర్యాల పెయింటింగ్, శాలువాను అందించి జిల్లా కలెక్టర్ మనుచౌదరి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, హౌసింగ్ పిడి దామోదర్ రావు, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డిఓలు చంద్రకళ, రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు, పంచాయితీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి డిఈ లు ఇతర శాఖల అధికారులు పాల్గోన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు