TG Inter Supplementary Exam: తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తన చేతుల మీదగా ఫలితాలను విడుదల చేశారు. ఈసారి రెండు సంవత్సరాలు కలిపి 9 లక్షల 97 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్టియర్ లో 71.37 శాతం, సెకండ్ ఇయర్ లో 66.89 శాతం పాస్ అయ్యారు. అయితే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక సూచనలు చేసింది.
సప్లిమెంటరీ పరీక్ష
జీవితంలో ఫెయిలైన ప్రతీ ఒక్కరికీ మరో అవకాశం ఉంటుంది. అలాగే పరీక్షల్లోనూ ఈ విధానాన్ని మన విద్యాశాఖ కల్పించింది. ఇందులో భాగంగా పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ విధానాన్ని తీసుకొచ్చింది. మార్చిలో జరిగిన పరీక్షల్లో ఫెయిలైన వారు మేలో జరిగే సప్లిమెంటరీలో మంచి ప్రదర్శన చేసే వీలును కల్పించారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్ ఫలితాల ప్రకటన సమయంలోనే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్.. సప్లిమెంటరీ పరీక్షల తేదీని ప్రకటించింది. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు 2025 మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
ఆత్మహత్యల నివారణకు
పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అప్రమత్తమైంది. రిజల్ట్స్ పై తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను తీసుకొచ్చింది. ఫలితాల వల్ల మానసికంగా కుంగిపోయిన విద్యార్థులు టెలీమానస్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 891 4416 ను సంప్రదించాలని సూచించింది. సంబంధిత నిపుణులు ఆయా విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని అందిస్తారని స్పష్టం చేసింది. తద్వారా మానసిక ఆందోళనల నుంచి బయటపడవచ్చని చెప్పింది.
Also Read: Telangana Inter Results 2025: ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. మార్క్స్ ఇలా తెలుసుకోండి!
అమ్మాయిలదే పై చేయి
ప్రతీ సంవత్సరం లాగే ఈసారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు పైచేయి సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 73 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. ఇంటర్ సెకండియర్‌లో 77.73 శాతం బాలికలు పాస్ అయ్యారని భట్టి విక్రమార్క వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈ సార్ పాస్ పర్సంటేజ్ పెరిగినట్లు తెలిపారు. కాగా అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు రిజల్ట్స్ పరంగా కాస్త వెనకబడ్డారు.