Minster Damodar Rajanarsimha: వడ దెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్‌ను మెడికల్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌ఐడీసీ) కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు. ఎండలు ముదురుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి సూచించారు. బయటకు వెళ్లినప్పుడు ఎండదెబ్బ బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.
తాగు నీరు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని సూచించారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే తక్షణమే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలన్నారు. తమ చుట్టూ ఉన్నవారిలో ఎవరికైనా వడ దెబ్బ తగిలితే, వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు బాధితున్ని తరలించాలని,లేదా 108 అంబులెన్స్‌కు సమాచారం చేరవేయాలని మంత్రి ప్రజలను కోరారు.
Also Read: Diagnostic Centers: వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లోనూ డయాగ్నస్టిక్ సెంటర్స్!
పిల్లలు, వృద్దులు, గర్భిణుల విషయంలో కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. వడదెబ్బపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకూ అన్ని చోట్ల వడ దెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.