Cm Revanth on CS DGP: రాష్ట్రంలో కొత్త సీఎస్ ఎవరు.. కొత్త డీజీపీ ఎవరు అనే చర్చ జోరుగా సాగుతుంది. సీనియార్టీకి ప్రాధాన్యత ఇస్తారా? ప్రతిభకు ప్రాధాన్యత దక్కుతుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పలువురి పేర్లు తెరమీదకు వచ్చాయి. సీఎస్ పదవి ఈ నెల చివరితో ముగియనుండగా, డీజీపీ పదవి సెప్టెంబర్ 30న ముగుస్తుంది. సీఎస్ పదవికోసం రామకృష్ణారావు, జయేష్ రంజన్, డీజీపీ పోస్టు కు శివధర్ రెడ్డి, సీవీ ఆనంద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరికి ప్రభుత్వ ఆశీస్సులు ఉంటాయనేదిచూడాలి.
ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారి ఈ నెల చివరితో ముగుస్తుంది. దీంతో సీఎస్ పదవి కోసం ఇప్పటికే ప్రభుత్వం అధికారుల వివరాలు సేకరించినట్లు సమాచారం. అందులో ప్రధానంగా రామకృష్ణారావు, జయేష్ రంజన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రామకృష్ణారావు 1991 బ్యాచ్ కు చెందిన ఆయన ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థికశాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Also Read: GHMC Employees: ఆరోగ్య సేవలు అందని ఉద్యోగులు.. హెల్త్ పాలసీ ఇంత నిర్లక్ష్యమా?..
ఆయన పదవీకాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది.ఆయన వరుసగా 14 సార్లు రాష్ట్ర బడ్జెట్ లను రూపకల్పనలో రికార్డు సృష్టించారు. అందులో 12 పూర్తిస్థాయి బడ్జెట్ లు కాగా, రెండు ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ లు ఉన్నాయి. దీంతో ఆయనకు ప్రభుత్వం గౌరవం ఇవ్వాలని భావిస్తుంది. సీఎస్ బాధ్యతలు అప్పగించనుందని ప్రచారం జరుగుతుంది. సీఎస్ రేసులో జయేష్ రంజన్ సైతం ఉన్నారని సమాచారం. 1992 బ్యాచ్ కు చెందిన వ్యక్తి. తెలంగాణ ప్రభుత్వ సమాచార-సాంకేతిక శాఖ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఇంకా రెండున్నరేండ్ల సర్వీస్ ఉంది.
మరో వైపు డీజీపీ ఎవరనే చర్చజరుగుతుంది. మరో సెప్టెంబర్30న డీజీపీ జితేందర్ రిటైర్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సీనియర్ పోలీసు అధికారుల్లో దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆయన రిటైర్మెంట్ కు మూడు నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ పోస్టుకు అర్హులైన అధికారులతో జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దానిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కు పంపించాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని ఎంపానల్ కమిటీ జాబితాలోని ముగ్గురు అధికారులను ఎంపిక చేసి ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని డీజీపీగా నియమించాల్సి ఉంటుంది.
Also Read: Hyderabad Traffic: మహానగరంలో తప్పని తిప్పలు.. బేజారవుతున్న వాహనదారులు!
ఈ నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అర్హులైన అధికారుల జాబితాను పంపించే ప్రక్రియ మే నెలాఖరులోగానీ…జూన్ మొదటి వారంలోగానీ మొదలు కావచ్చని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఇక, గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం డీజీపీ పోస్టులో నియమితుడయ్యే అధికారి 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు పోలీసు శాఖలోని ఏదో ఒక విభాగానికి డీజీ స్థాయిలో పని చేసిన అనుభవాన్ని కలిగి ఉండాలి.
డీజీపీగా నియమితులైతే రెండేళ్లపాటు ఆ పోస్టులో కొనసాగుతారు. అయితే, పదవీ విరమణకు ఆరు నెలల సర్వీస్ ఉన్న అధికారి పేరును కూడా యూనియన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపించే జాబితాలో చేర్చవచ్చు. అలాంటి అధికారి డీజీపీగా నియమితులైతే వారి సర్వీస్ ను పొడిగిస్తారు. ప్రధానంగా శివధర్ రెడ్డి, సీవీ ఆనంద్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. స్తుతం డీజీపీ పోస్టుకు రేసులో అయిదుగురు సీనియర్ పోలీసు అధికారులు ఉన్నారు. 1994వ సంవత్సరం బ్యాచ్ కు చెంది ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న శివధర్ రెడ్డి కూడా డీజీపీ పోస్టు రేసులో ఉన్నారు.
Also Read: Jobs In Japan: సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. జపాన్ లో ఉద్యోగాలు అవకాశాలు!
ఆయనకు 2026, ఏప్రిల్ వరకు సర్వీస్ ఉంది. ప్రస్తుతం డీజీ హోదాలో హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న 1991వ సంవత్సరం బ్యాచ్ అధికారి సీ.వీ.ఆనంద్ కూడా పోటీలో ఉన్నారు. ఆయనకు మరో మూడేళ్ల సర్వీస్ ఉంది. వీరితో పాటు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి, గతంలో ఇన్ ఛార్జ్ డీజీపీగా పని చేసిన రవిగుప్తా , జైళ్ల శాఖ డీజీగా ఉన్న సౌమ్యా మిశ్రా, సీఐడీ డీజీగా ఉన్న శిఖా గోయలో కూడా పోటీలో ఉన్నారు.
ఎవరిని వరించేనో…?
సీఎస్, డీజీపీ పోస్టులపై చర్చ జోరుగా సాగుతోంది. ఎవరిని నియమిస్తారు? ప్రభుత్వ ఆశీస్సులు ఎవరికి ఉంటాయనేది అధికారులు సైతం చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం సీనియార్టీ లిస్టును ఇప్పటికే సేకరించినట్లు సమాచారం. అందులో ఆ అధికారుల పనితీరు ఎలా ఉంది? ఏమైనా కాంట్రవర్సీ ఉందా? ప్రభుత్వం చేపట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషిచేస్తారా? అనుకూలంగా ఉంటారా? లేదా అనే వివరాలను సైతం సేకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రధానంగా పలువురు పేర్లు తెరమీదకు వచ్చాయి. అందులో సీనియర్లు ఉండటంతో ఎవరికి రాష్ట్రంలోని అత్యున్నత పదవులు అప్పగిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు