Congress on Kavitha: తెలంగాణను పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ (BRS Party).. ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆ పార్టీ.. లోక్ సభ ఎలక్షన్స్ లోనూ దారుణంగా ఓడి మరింత డీలా పడింది. ఈ క్రమంలో కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR).. రజతోత్సవ సభ (BRS Silver Jubilee Celebration)కు శ్రీకారం చుట్టారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ సభపై రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కల్వకుంట్ల కవితకు సంబంధించిన ఓ ఫొటోను వైరల్ చేస్తూ.. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ శ్రేణులు ఇరుకున పెడుతున్నారు.
ఆ ఫొటోలో ఏముందంటే?
గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), కవిత పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ హౌస్ లను నిర్మించినట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటి వద్ద కవిత దిగిన ఫొటోను కాంగ్రెస్ శ్రేణులు తెరపైకి తీసుకొచ్చారు. దాదాపుగా శిథిలావస్థకు వచ్చిన ఓ పెంకుటిల్లు వద్ద కవిత ఫొటో దిగారు. ఆ ఇంటిపై రాసి ఉన్న ‘కేసీఆర్ రజతోత్సవం’ స్లోగన్ పక్కన నిలబడ్డారు. అయితే ఈ ఫొటోను వైరల్ చేస్తూ కవితమపై విమర్శలు గుప్పిస్తున్నారు.
9 ఏండ్ల బంగారు తెలంగాణ నిజస్వరూపం ఈ ఫోటో.
డబుల్ బెడ్ రూం ఇండ్లు అన్నాడు
జాగా ఉన్నొల్లకు ఇల్లు కట్టుకుంటే పైసలు అన్నాడు.
ఆఖరికి నల్ల కవర్ కప్పుకొని ఉండే విధంగా పాలన చేసిండు.అయ్య చేసిన బ్రమండమైన పాలన చూపిస్తున్న రౌడీ బిడ్డ. pic.twitter.com/zzL5ia3uFo
— 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) April 18, 2025
కవితపై ప్రశ్నల వర్షం
శిథిలావస్థకు వచ్చిన ఇంటి వద్ద కవిత దిగిన ఫొటోపై కాంగ్రెస్ కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు. 9 ఏళ్ల బంగారు తెలంగాణకు ఈ ఫొటో నిజ స్వరూపం అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ‘డబుల్ బెడ్ రూం ఇండ్లు అన్నారు. జాగా ఉన్నోళ్లు ఇల్లు కట్టుకుంటే పైసలు అన్నారు. ఆఖరికి నల్ల కవర్ కప్పుకొని ఉండే విధంగా పాలన చేశారు. తండ్రి చేసిన బ్రహ్మాండమైన పాలనను చూపిస్తున్న కూతురు’ అంటూ కవిత దిగిన ఫొటోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
జోరుగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం
మరోవైపు సీఎం రేవంత్ (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్.. పేదల సంక్షేమమే పరమావధిగా కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. పేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో మెుదటి విడత కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి 26న ప్రారంభించగా.. ఒక నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 70,122 మందికి ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది. మిగతా అన్ని గ్రామాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలఖారు నాటికి లబ్దిదారులకు ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: HBD YS Vijayamma: విజయమ్మకు షర్మిల విషెస్.. జగన్ సైలెంట్.. పట్టించుకోని వైసీపీ!
ముమ్మర ఏర్పాట్లు
మరోవైపు రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ పార్టీ ముమ్మరంగా చేస్తోంది. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 400 మంది ఒకేసారి కూర్చునేలా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. భారీగా వచ్చే కార్యకర్తల కోసం 159 ఎకరాలను సిద్ధం చేశారు. సభకు వచ్చే వారి కోసం 10 లక్షల వాటర్ బాటిల్స్‌తోపాటు 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో పెట్టాలని పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు.