Investments In Telangana: తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ రోడ్ షోలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జపాన్ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని సాదరంగా ఆహ్వానించారు.
దేశంలోనే కొత్త రాష్ట్రం.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది.. జపాన్‌ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం ‘తెలంగాణ రైజింగ్’. ఈ రోజు తెలంగాణ జపాన్‌లో ఉదయిస్తోంది, అన్నారు.
టోక్యో చాలా గొప్ప నగరం. ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం. జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణ కలిగినవారు. మీ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నాను.. అని అన్నారు.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభ, స్థిరమైన విధానాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని జపాన్ వ్యాపారవేత్తలకు మాటిచ్చారు. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, టెక్స్ టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని.. భారత్, జపాన్ కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
Also read: Balmuri venkat on BRS: కవితను రాళ్లతో కొడతారు.. కాంగ్రెస్ నేత సంచలన కామెంట్స్
ఈ సమావేశంలో భారత రాయబారి సిబి జార్జ్ భారత్-జపాన్ మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడారు. జెట్రో (జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ మాట్లాడుతూ.. తెలంగాణతో సహకారాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
దేశంలోనే మొదటి నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీగా హైదరాబాద్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ, దేశంలోనే అద్భుతంగా నిర్మించ తలపెట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పై ప్రచార వీడియోలను రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికపై ప్రదర్శించింది.
ఎలక్ట్రానిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, టెక్స్ టైల్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో జపాన్ కంపెనీలకు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వివరించారు. రోడ్‌షో తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం మరియు జపాన్‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైంది.
స్వేచ్ఛ E – పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/