Waqf Amendment Bill (imagecredit:swetcha)
తెలంగాణ

Waqf Amendment Bill: మేం ముస్లింలకు మేలు చేస్తాం.. ఓవైసీ ఎంతమందికి సాయం చేశారో చెప్పాలి.. కిషన్ రెడ్డి!

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Waqf Amendment Bill: వక్ఫ్ చట్టాన్ని సవరించి పేద ముస్లింలకు మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని గతంలో బీజేపీ హామీ ఇచ్చిందని, అందుకే ఇటీవల వక్ఫ్ సవరణ చట్టం బిల్లును ఆమోదించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘వక్ఫ్ సుధార్ జనజాగరణ అభియాన్’ వర్క్‌షాప్‌ ను నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పార్టీ నాయకులకు వక్ఫ్​ పై దిశానిర్దేశం చేశారు. ఈ బిల్లును రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ సుమారు 25 రాష్ట్రాల్లో పర్యటించి, కోటి మందికి పైగా మేధావులు, ప్రజల అభిప్రాయాలను సేకరించిందన్నారు.

అనంతరం కమిటీ ఇచ్చిన సూచనల ఆధారంగా నివేదిక సమర్పించి, పార్లమెంటులో 21 గంటల పాటు చర్చ జరిపారన్నారు. అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు వక్ఫ్ సవరణ చట్టం ఏ వర్గానికి వ్యతిరేకం కాదని కేంద్రమంత్రి స్పష్టంచేశారు. దేశంలో పేద ముస్లింల హితార్థంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. బ్రిటీషర్ల హయాంలో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టాన్ని 1954లో పున: ప్రవేశపెట్టారని, 1995లో మరిన్ని మార్పులు చేశారన్నారు. అయితే, 2013లో యూపీఏ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను మభ్యపెట్టి వక్ఫ్ చట్టంలో మార్పులు చేసిందని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు అధికారాలను అపరిమితంగా విస్తరించి, భూములను ఏకపక్షంగా స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించారని తెలిపారు. దేశంలో రైల్వే, రక్షణ శాఖల తర్వాత అత్యధిక భూములు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయని, కానీ ఆ భూముల ఆదాయం పేద ముస్లింలకు ఉపయోగపడలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

వాల్లకి మాత్రమే లాభం:

వక్ఫ్ బోర్డు వల్ల మజ్లిస్ నాయకులు, మతపెద్దలు, ల్యాండ్ గ్రాబర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రమే లబ్ధి పొందాయని విమర్శలు చేశారు. పేద ముస్లింలకు వక్ఫ్ బోర్డు నుంచి ఎంత మేలు జరిగిందో అసదుద్దీన్ ఓవైసీ, రాహుల్ గాంధీ చెప్పగలరా? అని ప్రశ్నించారు. ల్యాండ్ మాఫియా ప్రచారానికి వారు మద్దతు తెలుపుతున్నారంటూ ధ్వజమెత్తారు. 2006లో వక్ఫ్ ఆస్తుల పరిమాణం 4.9 లక్షల ఎకరాలు కాగా, ఆదాయం రూ. 160 కోట్లు మాత్రమే వచ్చిందని, 2013లో అది రూ.166 కోట్లకు మాత్రమే చేరిందన్నారు. భూముల విలువ పెరిగినా, వక్ఫ్ బోర్డు ఆదాయం ఎందుకు పెరగలేదో సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం వక్ఫ్ ఆస్తులను సక్రమంగా వినియోగిస్తే ప్రతి సంవత్సరం రూ.12 వేల కోట్ల ఆదాయం రావచ్చని, ఈ ఆదాయాన్ని పేద ముస్లింలకు వినియోగిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.

గతంలో వక్ఫ్ భూములపై కొంతమంది రాజకీయ, మత నాయకుల పెత్తనం ఉండేదని, వారు లాభాన్ని దొడ్డిదారిన వినియోగించేవారన్నారు. ఇకపై వక్ఫ్‌గా క్లెయిమ్ చేసే ప్రభుత్వ ఆస్తులన్నింటినీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలించి, సర్వే చేసి వాటి హక్కును నిర్ధారించాల్సి ఉంటుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వక్ఫ్ చట్టంపై కొందరు నాయకులు మతాల మధ్య ఘర్షణలు రేపే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో వక్ఫ్ బోర్డు పరిధిలో 77 వేల ఎకరాల భూమి, 35 వేల ప్రాపర్టీలు ఉన్నాయని, వాటి ఆదాయ వివరాలు రేవంత్ రెడ్డి, ఓవైసీ చెప్పాలని, పేద ముస్లింలకు ఎంత సహాయం చేశారో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వక్ఫ్ ఆస్తులను కాంగ్రెస్‌ ముస్లిం నాయకులు, మజ్లిస్ నేతలు తమ రాజకీయ అధికారం పెంచుకునేందుకు వినియోగించుకున్నారన్నారు.

Also Read: Mahesh Kumar Goud: బీ ఆర్ఎస్ లో రౌడీలకు కొదవలేదు.. మహేష్​ కుమార్ గౌడ్

వక్ఫ్ బోర్డు పరిధిలో బినామీ పేర్లతో వందల కమ్యూనిటీ హాళ్లు నిర్మించారని, వాటి ఆదాయం దారుస్సలాంకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. వక్ఫ్ భూములన్నింటినీ డిజిటలైజ్ చేసి, ప్రతి సంవత్సరం ఆడిట్ చేసి, జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఓవైసీ, కాంగ్రెస్ నాయకులు ధైర్యముంటే 75 సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డుతో ఎంతమందికి న్యాయం చేశారో చెప్పాలన్నారు. అసదుద్దీన్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ముస్లింల ఓటుబ్యాంకు కోసం తప్పుడు ప్రచారం చేస్తూ, వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. మసీదుల నిర్వహణ వేరు, వక్ఫ్ భూముల నిర్వహణ వేరన్నారు. వక్ఫ్ బోర్డు పరిధిలో మసీదులు ఉండవని, వాటికి వేరు కమిటీలు ఉన్నాయన్నారు.

అలాగే ఎండోమెంట్ భూములు వేరు, టెంపుల్ కమిటీలు వేరన్నారు. ఈ వర్క్‌షాప్ అనంతరం జిల్లాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని నాయకులకు కేంద్ర మంత్రి దిశానిర్దేశం చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ‘వక్ఫ్ సుధార్ జనజాగరణ అభియాన్’ రాష్ట్ర కన్వీనర్ గంగిడి మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్ లో బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, బీజేపీ జాతీయ కార్యదర్శి అర్వింద్ మీనన్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పాటిల్, శాసనమండలి సభ్యుడు మల్క కొమురయ్య, బజీఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!