Liquor Price Hike: తెలంగాణలో మందు బాబులకు షాక్ తగలనుంది. చీప్ లిక్కర్ ను మినహాయించి మిగితా రకాల మద్యంపై ధరలను పెంచనున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ బెవరేజెస్ కార్పోరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలోనే ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు తెలిసింది. దీంతోపాటు కర్ణాటక తరహాలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయించాలన్న యోచన కూడా ఉన్నట్టు సమాచారం.
అధిక ధరల మద్యం పైనే పెంపు…
ఎక్సయిజ్ వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం చీప్ లిక్కర్ పై ధరలు పెరగటం లేదు. 500 కన్నా ఎక్కువ రేటు ఉన్న మద్యంపై కనీసం 10శాతం ధరలను పెంచనున్నారు. దీని కోసం రెండు మూడు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఏ విధానాన్ని అమలు చేస్తే ఎంత ఆదాయం వస్తుందన్న వివరాలతో వీటికి సంబంధించిన నివేదికలను రూపొందిస్తున్నారు.
ఈ ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి మద్యంపై 30వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది, ధరల పెంపు ద్వారా దీనికి అదనంగా మరో 2వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో ప్రభుత్వం బీర్ల ధరలను 15శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే.
Also Read: Kothagudem: డ్రంక్ అండ్ డ్రైవ్ మందుబాబులకు భారీ జరిమానా… ఎంతో తెలిస్తే షాక్!
టెట్రా ప్యాకెట్లలో…
ఇక, ఫ్రూట్ జ్యూస్ ల తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయించాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం కర్ణాటకలో మెక్ డొవెల్ కంపెనీ టెట్రా ప్యాకెట్ల ద్వారా 60, 90, 180 ఎంఎల్ మద్యాన్ని అమ్ముతున్నారు. ఇలా టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మటం వల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంని అధికారులు చెబుతున్నారు. సీసాల్లో దొరుకుతున్న మద్య్ం ధరలకన్నా ఈ టెట్రా ప్యాకెట్లలో అమ్ముడయ్యే మద్యం ధరలు కాస్త తక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ 120కి అమ్ముడవుతోంది.
అదే టెట్రా ప్యాకెట్లో అమ్మితే ధర 100 రూపాయలే ఉండవచ్చని అంటున్నారు. అయితే, టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే మొదట మహబూబ్ నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసి వచ్చే ఫలితాలనుబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తారని ఎక్సయిజ్ వర్గాలు చెబుతున్నాయి. టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయించటానికి మెక్ డొవెల్ కంపెనీ ఇప్పటికే ముందుకు వచ్చినట్టుగా ఎక్సయిజ్ అధికారులు తెలిపారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు