Biogas Plants in Telangana (imagecredit:twitter)
తెలంగాణ

Biogas Plants in Telangana: రాష్ట్రంలో మరో కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు.. మంత్రి తుమ్మల

Biogas Plants in Telangana: రాష్ట్రంలో ఉత్పత్తయ్యే వ్యవసాయ వ్యర్థాలను పర్యావరణహితంగా మార్చేవిధంగా ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 15 బయో గ్యాస్ (Compressed Bio-Gas – CBG) ప్లాంట్లను ఏర్పాటు చేసేలా GPS Renewables సంస్థ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావుకు ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయ వ్యర్థాలను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అవకాశాలు ఏర్పడుతాయి.

ఈ ప్రాజెక్టును IOCL (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్) మరియు BPCL (భారత పెట్రోలియం కార్పొరేషన్)లతో కలిసి GPS Renewables Arya సంస్థ 50:50 భాగస్వామ్యంగా అమలు చేయనుంది. ఒక్కో ప్లాంట్‌ 15 టన్నుల రోజువారి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండగా, మొత్తం 225 టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాష్ట్రంలో 15 జిల్లాలలో ప్లాంట్ల ఏర్పాటు:

ఈ ప్లాంట్లను రాష్ట్రంలోని 15 జిల్లాలలో మెదక్‌, సంగారెడ్డి, సిద్ధిపేట, కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, వనపర్తి, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ లలో ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ప్రతి ప్లాంట్ కోసం 20 ఎకరాల స్థలం అవసరం అవుతుందని, వరి గడ్డి మరియు నాపియర్ గడ్డిని నిల్వ చేయడానికి అదనంగా 25 ఎకరాలు అవసరమని తెలిపారు. ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చిన 18 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తిచేస్తామని కంపెని ప్రతినిధులు తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు, స్థానికంగా ఉండే దాదాపు 3,000 మంది గ్రామీణ యువతకు ప్రత్యక్ష మరియు పరోక్షంగా ఉద్యోగాలు కలుగనున్నాయి.

పర్యావరణ హితకరమైన ప్రయోజనాలు:

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి గడ్డి వినియోగించబడుతుంది. దీని ద్వారా ఏటా 82,125 మెట్రిక్ టన్నుల కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఇది సుమారు 57.84 లక్షల గృహ గ్యాస్ సిలిండర్లకు సమానమని ప్రాథమిక అంచనా. అంతేకాకుండా 3 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రీయ ఎరువు ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల వ్యవసాయ రంగంలో మట్టి నాణ్యత మెరుగవడంతోపాటు సేంద్రియ వ్యవసాయానికి బలమైన తోడ్పాటు లభిస్తుంది. ఇక గ్రీన్ హౌస్ వాయువుల విడుదలలో 17.24 లక్షల మెట్రిక్ టన్నుల తగ్గింపు సాధ్యమవుతుంది.

ఈ నేపథ్యంలో GPS Renewables Arya సంస్థ ప్రతినిధులు వ్యవసాయ మంత్రిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో పునరుత్పాదక ఇంధన రంగం కీలక పాత్ర పోషించాలి. వ్యవసాయ వ్యర్థాలే రైతులకి ఆదాయ మార్గంగా మారే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. GPS Renewables సంస్థ చేసిన ప్రతిపాదన రాష్ట్ర లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ప్రభుత్వం దీనికి అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది అని హామీ ఇచ్చారు. అలాగే, ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు ఉపాధి, రైతులకు ప్రత్యక్ష ఆదాయం, పర్యావరణ పరిరక్షణ వంటి బహుళ ప్రయోజనాలు కలగనున్నాయని మంత్రి స్పష్టం చేశారు.

Also Read: SLBC Tunnel Update: ఎస్‌ఎల్‌బీసీ పై కీలక అప్డేట్.. 12 మందితో కమిటీ ఏర్పాటు!

అదేవిధంగా ఒక ఎకరా వరిపంట కోసిన తర్వాత దాదాపు 20 నుండి 25 క్వింటాళ్ల వరకు వరి కొయ్యలు మరియు గడ్డి రూపంలో, ఒక ఎకరాలో పత్తి ఏరిన తర్వాత 20 క్వింటాళ్ళ వరకు పత్తి కట్టే మరియు పంట అవశేషాలు మిగిలిపోవడం జరుగుతుందని, వీటిని రైతులు కాల్చడం ద్వారా ద్వారా నేలలోని కర్బనం, కార్బన్ డై ఆక్సైడ్ గా మారి వాతావరణంలోకి విడుదలై ఉష్ణోగ్రత పెరగడానికి కారణం అవుతుందన్నారు. నేలలో ఉండే సూక్ష్మజీవులు, వానపాములు మరియు మిత్రపురుగులు చనిపోయి, నేల పొరల్లో ఉండే తేమ శాతం ఆవిరైపోతుంది. దీనివల్ల పంట ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. ఇప్పటికే తెలంగాణలో సుమారు 70 శాతం సాగు భూముల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉందన్నారు.

హరిత భవిష్యత్తు దిశగా తెలంగాణ:

ఈ సంవత్సరం వానాకాలంలోనే 65 లక్షల ఎకరాల్లో వరి పంట, 43 లక్షల ఎకరాలలో పత్తిపంట సాగు అయిందని, తదనుగుణంగా దాదాపు 13 నుండి 14 కోట్ల క్వింటాళ్ల వరకు వరి కొయ్యలు, మరియు 8.6 కోట్ల క్వింటాళ్ల వరకు పత్తి కట్టే అవశేషాలు మిగులుతాయని, వీటిని రైతులు కాల్చకుండా ఈ సంస్థ వారికి అమ్ముకున్నట్టయితే పర్యావరణానికి మేలుతో పాటు, రైతులకు ఆదాయ మార్గంగా ఉంటుందని మంత్రిగారు పేర్కొన్నారు.

ఈ ప్రతిపాదన కేవలం ప్లాంట్లు నిర్మాణం కోసం మాత్రమే కాదు, ఇది పర్యావరణ సమస్యలు తగ్గించడానికి, వ్యవసాయ వ్యర్థాలను కూడా ఆదాయ మార్గంగా మార్చడానికి, గ్రామీణ జీవన స్థాయిని మెరుగుపరచడానికి రూపొందిన సమగ్ర ప్రణాళిక అని, తెలంగాణ రాష్ట్రం హరిత రాష్ట్రంగా మారేందుకు ఇది మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నట్టు మంత్రి గారు తెలిపారు.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు