Gaddar Awards: కళాకారులను గుర్తించి, ప్రభుత్వం సత్కరించే ఆచారాన్ని గత ప్రభుత్వాలు పక్కన పెట్టేశాయి. ఎప్పుడైతే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణం స్వీకారం చేశారో, కళాకారులకు కూడా తగిన గుర్తింపును ఇస్తూ వస్తున్నారు. ఇక నంది అవార్డ్స్ స్థానంలో ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’ (Gaddar Telangana Film Awards) పేరిట ఇకపై కళాకారులను సత్కరించుకుంటామని ప్రకటించారు. అది కేవలం ప్రకటనగా పక్కన పెట్టేయకుండా అవార్డులు ఇచ్చేందుకు వడివడిగా అడుగులు వేయిస్తున్నారు. తెలంగాణ ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ అవార్డులకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధను ఎంపిక చేశారు. ఆమె అధ్యక్షతన బుధవారం ఎఫ్‌డిసి సమావేశ మందిరంలో సమావేశం జరిగింది.
Also Read- Pooja Hegde: వారంతా నా సినిమాలు చూడరు, నా ఫ్యాన్స్ కూడా అయ్యిండరు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌కు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు కోరారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్‌గా తీసుకుని ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లుగా జ్యూరీ ఛైర్మన్ జయసుధ (Jayasudha) తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. టాలీవుడ్‌కు సంబంధించి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను కోరారు. జ్యూరీలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. దాదాపు 14 ఏండ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డ్స్‌ను ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డ్స్‌కు ఇంత స్పందన రాలేదని చెప్పారు.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎస్. హరీష్ మాట్లాడుతూ.. సినీ నటి జయసుధ ఛైర్మన్‌గా 15 మందితో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గద్దర్ అవార్డ్స్‌కు అన్ని కేటగిరీలకు కలిపి 1,248 నామినేషన్లు అందినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నెల 21వ తేదీ నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు.
Also Read- Raj Tarun- Lavanya: రాజ్ తరుణ్ పేరెంట్స్‌ని గెంటేసిన లావణ్య.. మళ్లీ మొదలు!
ఈ గద్దర్ అవార్డ్స్‌కు సంబంధించి వివిధ కేటగిరీల ఎంట్రీలకు గానూ వచ్చిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యులు చర్చించారు. ఈ పురస్కారాలకు వ్యక్తిగత కేటగిరీలో 1172.. ఫీచర్ ఫిలిం, బాలల చిత్రాలు, డెబ్యూ చిత్రాలు, డాక్యుమెంటరీ/ లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరీలలో 76 దరఖాస్తులు వచ్చినట్టు జ్యూరీ తెలిపింది. మరిన్ని వివరాలను మరో అప్డేట్‌తో ప్రకటిస్తామని ఈ సందర్భంగా జ్యూరీ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా చాలా హ్యాపీగా ఉంది. త్వరలోనే అవార్డుల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా అంతా ప్లాన్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు