TG on SDRF: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఎన్నో కుటుంబాలకు కష్టసమయంలో ఆసరాగా నిలవనుంది. ఇప్పటి వరకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రెండింతలు కాదు, ఏకంగా పెద్ద మొత్తాన్ని అందించేందుకు సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి? అసలు ఎంత సాయాన్ని అందిస్తారో తెలుసుకుందాం.
అసలే సమ్మర్ సీజన్. ఎండలు దంచి కొట్టనున్నాయి. ప్రస్తుతం కాస్త వర్షాలు కురుస్తున్నా, ఇక రానున్నది మాత్రం గడ్డుకాలమే. ఔను.. మండే ఎండలు విపరీతం కానున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఎండలపై ప్రభుత్వం ఆయా జిల్లా అధికారులను కూడా అప్రమత్తం చేసింది. అయితే త్వరలోనే విద్యార్థులకు వేసవి సెలవులు రానున్నాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులు సైతం అత్యవసరమైతే తప్ప ఎండల్లో బయటకు రావద్దని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
కాగా ఎండల కాలంలో వడదెబ్బకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువ. గతంలో వడదెబ్బకు ఎందరో మృత్యు ఒడికి చేరిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి వారి కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వం రూ. 50 వేలు సాయం అందిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
తీవ్రమైన ఎండలు, వడగాలులు, వడదెబ్బ వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు ఆదుకోవడానికి రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే గతంలో రూ. 50 వేలు చెల్లించడానికి వీలుండేది. రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద ప్రస్తుతం ఆ ఎక్స్ గ్రేషియాను రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 5 ను విడుదల జారీ చేసింది.
Also Read: Kotha Prabhakar on Congress: కూలుస్తాం అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. దద్దమ్మలు అంటూ కాంగ్రెస్ ఫైర్
ఇలావుండగా, వడగాలుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు జారీ చేసిన ఆరోగ్య సలహాలను పాటించాలని ప్రభుత్వం కోరింది. వడగాలులు వాటి ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రభుత్వం సంబంధిత శాఖల ద్వారా కార్యక్రమాలను చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం రూ. 4 లక్షల సాయం అందించడం గొప్ప విషయమని ప్రజలు తెలుపుతున్నారు.