Ramakrishna on Pawan Kalyan: తన కుమారుడి ఆరోగ్యం త్వరగా కుదుటపడడంతో తిరుమల శ్రీవారిని దర్శించి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తలనీలాలు స్వామి వారికి సమర్పించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయంపై సిపిఐ రామకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ కామెంట్స్ లక్ష్యంగా ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు సిపిఐ రామకృష్ణ చేసిన కామెంట్స్ ఏమిటంటే..
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయాలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సింగపూర్ వైద్యశాలకు స్థానికులు మార్క్ శంకర్ ను వెంటనే తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ సైతం చెప్పుకొచ్చారు. తాజాగా సింగపూర్ లో చికిత్స నందుకొని శంకర్ ఇంటికి చేరాడు.
దీనితో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించి స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అంతేకాకుండా శ్రీవారి అన్న ప్రసాదానికి ఒకరోజు వితరణ చేసి తమ భక్తిని చాటుకున్నారు. స్వయంగా ఆమె క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ మతాన్ని గౌరవించి, డిక్లరేషన్ సైతం టిటిడి అధికారులకు అందజేశారు.
ప్రస్తుతం ఇదే విషయంపై సిపిఐ రామకృష్ణ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మంగళవారం మీడియా సమావేశంలో సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ.. బ్యాంకులను ముంచిన 20 మంది కోటీశ్వరులు దేశాన్ని ముంచి వేరే దేశాలకు వెళ్లి దాక్కున్నారన్నారు. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి దేశం దాటి వెళ్లిపోయారని, వారిని వెనక్కి తెప్పించలేకపోతున్నట్లు కేంద్రంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఎంతసేపటికి మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వక్ఫ్ విషయంలో దేశంలో మిగతా రాజకీయ పార్టీలు దీన్ని ఎవరు ఒప్పుకోలేదన్నారు. ఇంత దిగజారి మాట్లాడే ప్రధానమంత్రిని తాము ఎప్పుడూ చూడలేదని, దేశంలో ప్రమాదకరమైన రాజకీయాలకు నాంది పలుకుతున్నారని తెలిపారు.
Also Read: Warangal Crime: చచ్చిపో అన్న కొడుకు, కోడలు.. అదే పని చేసిన తండ్రి.. వరంగల్ లో దారుణం..
ఇక పవన్ కళ్యాణ్ సతీమణి తలనీలాలు సమర్పించడం పై స్పందించిన రామకృష్ణ.. పవన్ కళ్యాణ్ తన భార్యతో గుండు కొట్టించారని, అంత అవసరమా, ఆమె ఒక క్రిస్టియన్ కదా అంటూ రామకృష్ణ ప్రశ్నించారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వివాదానికి దారితీసాయి. హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి పవన్ సతీమణి శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించిన విషయాన్ని రాద్ధాంతం చేస్తూ రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అని జనసేన పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రామకృష్ణ ఇటువంటి కామెంట్స్ చేసే విషయంలో సంయమనం పాటించాలని, ఆమె తలనీలాలు సమర్పించే విషయం ఆమె వ్యక్తిగత విషయం అంటూ వారు చెప్పుకొస్తున్నారు. ఇలా రామకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో రామకృష్ణ క్షమాపణ చెబుతారా లేదా అన్నది మున్ముందు తేలాల్సి ఉంది.